స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానత్వాన్ని చాటుతున్న దాతలు నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
నేటి కాలంలో రక్తసంబంధాలు కూడా భారంగా మారాయి. కానీ ఏ బంధం లేకపోయినా మానవత్వం రక్తదాతల రూపంలో ఇంకా ఇతరులకు సాయం చేస్తోంది. ఇలాంటి వారు ప్రాణదాతలుగా మారుతున్నారు. అర్ధరాత్రి... అపరాత్రి... అని తేడా చూసుకోకుండా ఫోన్ చేయగానే సొంత ఖర్చులతో ఆస్పత్రికి తక్షణమే వెళ్లి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. ఆ క్షణంలో వారు చేసే రక్తదానం నిండు ప్రాణాన్ని కాపాడుతోంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనమిదీ..
గుంటూరు మెడికల్: జిల్లాలో పలువురు యువత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రక్తం కావాల్సిన వారి కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లు రూపొందించి సేవ చేస్తున్నారు. మరికొంత మంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. దానిని కృత్రిమంగా తయారు చేయలేం. మనిషి జీవించటానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో రక్తం కూడా అంతే ముఖ్యం. మానవ శరీరంలోని ప్రతి అవయవం రక్తసరఫరాతోనే పనిచేస్తుంది. కొన్ని ఆపరేషన్లు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా రక్తం అవసరం అవుతుంది. రోడ్డు ప్రమాద బాధితులు కొన్ని సందర్భాల్లో రక్తం లభించక ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు రక్తం దొరక్క ఆపరేషన్లు సైతం వాయిదాలు పడుతుంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కో రక్తం గ్రూపు ఉంటుంది. ఏ మనిషిలో ఏ రక్తం ఉంది, రక్తంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి అనే విషయాలను కనిపెట్టిన ఆస్ట్రేలియా దేశానికి చెందిన కార్ల్ లాండ్ స్టీనర్ 1868 జూన్ 14న జన్మించారు. ఆయన జయంతి నాడే ఏటా ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఒక్క చుక్క మానత్వం అనే నినాదంతో ఈ దినోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇదీ...
రక్తంలో గ్రూపులు...
రక్తంలో ఏ, బీ, ఓ, ఏబీ పేరిట పాజిటివ్, నెగిటివ్ గ్రూపులు ఉంటాయి. ఏబీ నెగిటివ్ రక్తం చాలా అరుదుగా లభిస్తుంది. ఏబీ పాజిటివ్ రక్తం గ్రూప్ వారు యూనివర్సల్ రిసీవర్స్. ఎవరి రక్తమైనా వీరికి ఎక్కించవచ్చు. ఓ నెగిటివ్ గ్రూప్ వారు యూనివర్సల్ డోనార్స్. వీరు ఎవరికై నా రక్తం ఇవొచ్చు. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా రక్తంలో ఉంటాయి. ఒక్క వ్యక్తి రక్తదానం వల్ల నలుగురికి ప్రాణదానం చేయవచ్చు. రక్తదానం చేసేందుకు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, కనీసం 45 కిలోల బరువు ఉండాలి. షుగర్, బీపీ, గుండెకు సంబంధించిన జబ్బులు, కంటి రోగాలు ఉండకూడదు. సుఖవ్యాధులు ఉన్న వారు, ఆపరేషన్ చేయించుకున్న వారు, రక్తహీనతతో బాధపడుతున్న వారు రక్తం ఇవ్వరాదు. ప్రతి మనిషి ఏడాదిలో నాలుగుసార్లు రక్తదానం చేయవచ్చు. శరీరం నుంచి 350 మిల్లీగ్రాముల రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. రక్తదానం చేసేందుకు 10 నుంచి 15 నిమిషాల వ్యవధి చాలు. రక్తదానం చేయటం వల్ల మళ్లీ తాజా రక్తం శరీరంలోకి వస్తుంది. తద్వారా చాలా ఆరోగ్యంగా ఉంటారు. రక్తాన్ని తీసుకునే ముందు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. రక్తం ఇచ్చిన అరగంట సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదులో ద్రవపానీయాలు ఉండేలా చూసుకోవాలి. రక్తదానం చేసిన ఆ ఒక్క రోజు బరువు ఉన్న వస్తువులు ఎత్తకూడదు.
అవగాహన కల్పిస్తున్నారు....
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదానంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలు, డిగ్రీ కళాశాలలు, యువతలో స్వచ్ఛంద రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరిస్తూ వారు ముందుకు వచ్చి రక్తదానం చేసేలా వైద్య అధికారులు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 17 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా హెచ్‌ఐవీ వంటి ఇన్‌ఫెక్షన్‌లను ముందస్తుగానే గుర్తించి కట్టడి చేయవచ్చు.


