బస్టాండ్ చుట్టూ అడ్డగోలుగా కొనసాగుతున్న ఆక్రమణలు నిషేధిత ప్రదేశంలో ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూమ్, దుకాణాలు ఏర్పాటు వినుకొండ రోడ్డు మార్జిన్‌లో మళ్లీ ఆక్రమణల జోరు
రెండేళ్లుగా మళ్లీ...
నరసరావుపేట: గుంటూరు–కర్నూలు రహదారిపై వినుకొండకు వెళ్లే రోడ్డును ఆనుకొని ఉన్న ఆర్‌టీసీ బస్టాండ్ చుట్టూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గతంలో ఆర్‌టీసీ అధికారుల వినతులతో ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి ఆక్రమణలు తొలగించారు. అదే ప్రదేశంలో గత రెండేళ్ల నుంచి మళ్లీ ఆక్రమణలు యథేచ్ఛగా చోటుచేసుకోవటం గమనార్హం.
పెరిగిన రద్దీ
జిల్లా కేంద్రంగా ఉంటూ రాయలసీమకు ప్రవేశమార్గంగా ఉండే నరసరావుపేట బస్టాండ్ నుంచి బస్సులు, వాటి ద్వారా ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. సీ్త్రశక్తి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతో బస్టాండ్ నిత్యం రద్దీగా మారింది. అలాగే సమీపంలోనే ప్రముఖ మాల్ ఉండటం వలన ఇటుగా రాకపోకలు పెరిగాయి. డిపోనకు చెందిన 90 బస్సులతోపాటు పైనుంచి నరసరావుపేట మీదుగా ప్రయాణం చేసే మరికొన్ని వస్తుంటాయి. నిత్యం రూ.12.50 లక్షల వరకు ఆదాయం ఆర్టీసీకి వస్తుంది. ఇంతటి రద్దీ ఉండే బస్టాండ్ చుట్టూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. బస్సులు బయటకు వచ్చే ప్రవేశమార్గాన్ని ఆనుకొని ఉన్న ప్రదేశంలో బడ్డీ కొట్లు, ఇతర వాణిజ్య షాపులను గత ప్రభుత్వంలో ట్రాఫిక్ పోలీసుల పహారా మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. వాటి వలన డ్రైవర్లకు బస్టాండ్ దాటి రోడ్డుపైకి వచ్చే వరకు వినుకొండ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు కనిపించేవి కాదు. పలువురు డ్రైవర్లు చేసిన ఫిర్యాదు మేరకు డిపో అధికారులు ఆ అక్రమ వ్యాపారులను తొలగించారు. శుభ్రం చేసి ఆ ప్రదేశం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆక్రమణల ప్రదేశంగా ప్రకటించి పోలీసు పహారాతో గతంలో ఆక్రమణలు తొలగించిన ప్రదేశంలో ఇటీవల ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేయటం చర్చనీయాంశమైంది. డిపో వద్ద ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ చాలా అవసరం. లేకపోతే ఆటోవాలాలు బస్సులు ఆగిన ప్రదేశానికి వెళ్లి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. దానిపై డిపో అధికారుల విజ్ఞప్తి మేరకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అక్కడే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ప్రదేశంలో ఓ బడ్డీ కొట్టును ఏర్పాటు చేసి దానిపై టీడీపీ, జనసేన జెండాలు పెట్టి కొనసాగించారు. ప్రస్తుతం దానిపై ఆ జెండాలు తొలగించారు. దానిపక్కనే ప్రభుత్వం స్పాన్సర్ చేసిన అరకు కాఫీ స్టాల్ ఏరా్పాటు చేశారు. దానిని స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధి ప్రారంభించారు. ఇటీవల వినుకొండరోడ్డులో జూపల్లి సెంటర్‌ను దాటి రోడ్డుకు ఇరువైపులా తొలగించిన ప్రదేశంలో మళ్లీ ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. చిరు వ్యాపారులు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు రోడ్డు పక్కనున్న ఆర్ అండ్ బీ స్థలాలను ఆక్రమించారు.


