నెహ్రూనగర్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్, చైల్డ్‌లైన్ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. మిర్చి యార్డు పరిధిలోని మిర్చి గ్రేడింగ్ పాయింట్లలో సోమవారం జరిపిన తనిఖీల్లో ఆరుగురు బాల కార్మికులను గుర్తించారు. వారిని వెంటనే పని నుంచి విడిపించి పాఠశాలకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. చిన్నారుల భవిష్యత్ దృష్ట్యా వారికి చదువు అవకాశాలు కల్పించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న ముగ్గురు యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేశారు. బాల కార్మిక చట్టం ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్‌లైన్ నంబర్‌కు, 9492555157కు సమాచారం అందించాలన్నారు. తనిఖీల్లో డిప్యూటీ లేబర్ కమిషనర్ గాయత్రిదేవి, లేబర్ ఆఫీసర్ బొందలపాటి కోటేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాసంతి, చైల్డ్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.
పెదకాకాని: పెదకాకానిలోని గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ విచ్చేశారు. ఆయనకు ఆలయ పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచందర్రావు, ఆలయ అర్చకస్వాములు, వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజలలో ఆయన పాల్గొన్నారు. ఐజీకి ఆలయ అర్చకస్వాములు, వేదపండితుల వేద ఆశ్వీర్వచనం చేసి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ధూపాటి శివ శంకరరావు, ఎక్స్ అఫీషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వర ప్రసాద్, సిబ్బంది ఉన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీఐఎంఎస్‌ఈఏ) విజయవాడ రీజినల్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నగరంలో శనివారం జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఆర్.ప్రవీణ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ సి.సిద్దావలి, సెక్రటరీగా ఎస్.మురళి, జాయింట్ సెక్రటరీగా వి.చలపతిరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పి.మంగతాయారు, ఆర్.నల్లయ్య, బేతపూడి రాము, జి.రాజేష్, బి.నాగరాజు, వి.మోహనరావు, ఎన్.ఆంజనేయులు ఎన్నికయ్యారు. స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.శేషగిరిరావు, స్టేట్ సెక్రటరీ వి.సురేష్‌కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్.గిరిధర్ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) 12 ఏళ్ల ప్రగతి, విజయాలను పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన ‘యాత్రి సౌకర్య దివస్’ నిర్వహించనున్నట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 12 ఏళ్లలో విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధించి దేశీయ విమాన రంగంలో కీలక కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. 2014–15లో రూ.5.98 కోట్లు ఉన్న ఎయిర్‌పోర్ట్ వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ.87.97 కోట్లకు చేరిందని, ప్రయాణికుల సంఖ్య 2.33 లక్షల నుంచి 14.11 లక్షలకు పెరిగిందన్నారు. ప్రస్తుతం రూ.791.59 కోట్లతో 51,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. పలు ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.


