నీట మునిగిన నాగన్నకుంట | - | Sakshi
Sakshi News home page

నీట మునిగిన నాగన్నకుంట

Jun 14 2026 7:04 AM | Updated on Jun 14 2026 7:04 AM

నీట మునిగిన నాగన్నకుంట

తటాకాల్లా మారిన వీధులు సత్తెనపల్లి–నరసరావుపేట, సత్తెనపల్లి – అమరావతి మార్గాల్లో నిలిచిన రాకపోకలు

సత్తెనపల్లి: మబ్బులు పట్టి .. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందంటే చాలు సత్తెనపల్లి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. శనివారం తెల్లవారుజాము సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో సత్తెనపల్లి–నరసరావుపేట, సత్తెనపల్లి–అమరావతి రహదారిలో రాక పోకలు నిలిచిపోయాయి. ఉదయం సుమారు గంటకు సత్తెనపల్లి నుంచి నరసరావు పేట వెళ్లేందుకు నాగన్నకుంట సమీపంలో కాలువ పొంగి రహదారిపైగా నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు 9 గంటల సమయంలో కొంతమేర నీరు తగ్గడంతో ఆ నీటిలో నుంచే రాకపోకలు కొనసాగాయి. ఇక నాగన్నకుంట లోతట్టు ప్రాంతం కావడంతో పూర్తిగా నీటమునిగింది. వీధుల్లో వర్షపు నీరు చేరి ఇళ్ళల్లో నుంచి బయటకు రావడానికి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పట్టణంలోని నాగన్న కుంట, శాలివాహననగర్‌, సుందరయ్యకాలనీ, వెంకటపతి కాలనీతో పాటు మాస్ట్రీన్‌పేట, దోబీఘాట్‌ ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచింది. ఆయా ప్రాంత ప్రజలు వర్షపునీరు నిల్వడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇది ఇలా ఉంటే సత్తెనపల్లి–అమరావతి మార్గమధ్యలోని నందిగామ లోలెవల్‌ చప్టా పైగా వరద ఉధృతి ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా.. సమస్య పరిష్కారానికి మాత్రం చర్యలు చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నందిగామలోని ప్రధాన రహదారి పూర్తిగా నీట మునిగింది. వరద నీరు గృహాల చెంతకు చేరి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మాతృశ్రీ అచ్చమాంబ తల్లి దేవాలయ సమీపంలో వరద నీరు నిలిచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement