గుంటూరు రూరల్: అగ్రిగోల్డ్ మోసానికి మరో వృద్ధురాలు బలైంది. భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్‌లో ఫిక్సిడ్ డిపాజిట్‌గా దాచుకున్న రూ.25,000 కోసం ఎదురుచూసి చివరికి తుదిశ్వాస విడిచింది. వివరాలు.. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన తన్నీరు పోలేరమ్మ(70) కూలి పనులు చేసుకుని జీవించేది. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిపించింది. పిల్లలంతా తమ కుటుంబ సభ్యులతో ఎవరి కుటుంబాలు వారు చూసుకుంటుండగా, భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని అప్పట్లో అగ్రిగోల్డ్‌ను నమ్మి రూ.25,000 కడితే చివరికి రూ.50,000 వస్తాయని ఆశతో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకుంది. 2012లో కడితే 2018లో తనకు డబ్బు వస్తుందని ఆశ పడింది. 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన దగ్గర నుంచి, అవసర పడతాయి అనుకున్నా డబ్బులు ఇక రావని దిగులుతో నిత్యం మదనపడుతూ ఉండేది. అప్పట్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలు, దీక్షలు చూసి కొంత ధైర్యంగా ఉన్నా, వృద్ధాప్యంలో డబ్బులు లేక అనేక బాధలు పడుతూ ఉండేది. ఇప్పటికే 12 సంవత్సరాలు దాటి, ప్రభుత్వాలు మారుతున్న ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ డబ్బులు తిరిగి బాదితులకు అందించే దిశగా కృషిచేస్తామని కూటమి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చి, రెండు సంవత్సరాలు అవుతున్న మాటలు చెబుతున్నారని, చేతల్లో డబ్బులు వస్తాయన్న నమ్మకం లేకపోయిందని, మానసికంగా ఆలోచించి, గుండెనొప్పితో శనివారం మృత్యువాతకు గురైంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ కోర్టు పెట్టడంతో పాటు కంపెనీ డేటా ప్రకారం వడ్డీతో సహా ప్రతి బాధితునికి త్వరలో డబ్బులు ఇచ్చి న్యాయం చేసి మరో ప్రాణహాని జరగకుండా చూడాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కుంచాల అంకమ్మరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


