తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని అంగలకుదురు గ్రామం సమీపంలోని తెనాలి–గుంటూరు ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు. తెనాలి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ కలవకొల్లు మధుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి గొంది అశోక్ పరారయ్యాడు. మొత్తం 79 బస్తాలలో సుమారు 3,950 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఐతానగర్ ప్రాంతంలోని ఎస్‌బీఐ బ్యాంకు వెనుక గల రేషన్ షాపు నుంచి లోడ్ చేసి, వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలోని హరీష్ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గొంది అశోక్, కలవకొల్లు మధుబాబు, ఐతానగర్ రేషన్ డీలర్ కుటుంబ సభ్యుడు, అనంతవరప్పాడు ప్రాంతానికి చెందిన రైస్ మిల్ నిర్వాహకుడు హరీష్‌లను నిందితులుగా గుర్తించినట్టు రూలర్ ఎస్‌ఐ కె.ఆనంద్ తెలిపారు. బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపారు.


