వినుకొండలో ....
నరసరావుపేట: ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు పాలనపై వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు.
మాచర్ల నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం నంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తొలుత ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్‌కే, పార్లమెంటు పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు, ఎస్‌సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతు నాయక్, జిల్లా ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్‌లు ప్రత్యేక పూజలు చేశారు. వేల మంది వెంటరాగా నాయకులు ఎడ్లబండిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వివిధ ప్రాంతాల్లో అడ్డగించినా పట్టించుకోకుండా వేల మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కార్మికులు భారీగా పాల్గొన్నారు. రింగ్‌రోడ్డు, బస్టాండ్ సెంటర్లలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు మేనిఫెస్టో ప్రతులను బస్టాండ్‌లో దహనం చేశారు. పలువురు కార్యకర్తలు యాచకులుగా వినూత్నంగా నిరసన నిర్వహించారు. పీఆర్‌కే, గౌతంరెడ్డి, కేవీ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అధికారంలోకి రాకముందు చీటర్ అవతారం ఎత్తి అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను గాలికి వదిలేసిన గాలికి కొట్టుకుపోయే నాయకుడు చంద్రబాబు అన్నారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో వేలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసనను జయప్రదం చేశారని పేర్కొన్నారు.
నరసరావుపేటలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేల మంది నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయ నుంచి ప్రారంభమైన ర్యాలీ స్టేషన్ రోడ్డులోని ఆర్‌డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా కొనసాగింది. ప్రతి ఒక్కరూ పార్టీ జెండా చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొనసాగారు. ఆర్‌డీఓ కార్యాలయంలో పరిపాలనాధికారికి కూటమి ప్రభుత్వ వైఫల్యంపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌లు పూర్తిగా అవినీతిమయమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. మెగా డీఎస్సీని దగా చేసి స్పోర్ట్స్ కోటా కింద తమ వారికే ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలపై మోసం చేశారన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు దొంతిరెడ్డి అంజిరెడ్డి, కనకా పుల్లారెడ్డి, ఎన్‌కే ఆంజనేయులు, టి.మంగమ్మ, ఎస్.సుజాతాపాల్, గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్, కొత్తూరి కిషోర్‌బాబు పాల్గొన్నారు.
చంద్రబాబు వెన్నుపోటు పాలనపై ప్రధాన రహదారి మీదుగా గడియారం స్తంభం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి తాలూకా సెంటర్ వరకు చేరుకుంది. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు పెద్దసంఖ్యలో కదం తొక్కారు. తాలూకా సెంటర్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు పరచకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. పార్టీ నాయకులు డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి, డాక్టర్ గీతా వాసంతి, జంగారపు అనూష, చల్లంచర్ల సాంబశివరావు, రమావత్ కోటేశ్వరరావు నాయక్, రాయపాటి పురుషోత్తమరావు, షేక్ మౌలాలి, భవనం రాఘవరెడ్డి, నక్కా శ్రీనివాసరావు, వేపూరి శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వినుకొండలో రాష్ట్ర అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జునయాదవ్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు బాసులింగారెడ్డితో పాటు ఐదు మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి శివయ్య స్తూపం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్రసంగించారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడవటంతో ప్రారంభమైన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ప్రతిపక్షం, అధికారపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజలను మోసం చేయటం అలవాటుగా సాగుతోందన్నారు.


