నరసరావుపేట ఈస్ట్: బడి గంట మోగింది. వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తొలిరోజు కావటంతో ప్రాథమిక తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులతో పాఠశాలకు చేరుకున్నారు. నూతన ప్రవేశాల కోసం పలువురు వచ్చి పిల్లలను వివిధ తరగతులలో చేర్పించారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని 2,018 పాఠశాలల్లో 2,75,254 మందికిగాను 1,39,425 మంది హాజరైనట్టు అధికారులు గుర్తించారు. జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు మండలంలోని యలమంద జెడ్పీ హైస్కూల్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంప్రసాద్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాల, డిప్యూటీ డీఈఓ సుభాని సొలస జెడ్పీ హైస్కూల్, ఎంఈఓలు తమ తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించారు. మనబడి పండుగ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, 6వ తరగతి విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. అలాగే ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించి, సూచనలు చేశారు.
పాఠశాలలను పరిశీలించిన
విద్యాశాఖ అధికారులు


