నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబందించి ఏర్పాటుచేసిన రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిషన్‌కు జిల్లాలోని బీసీ సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు, వినతిపత్రాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషన్ ఈనెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు గుంటూరు కలెక్టర్ కాంపౌండ్‌లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశమౌతారన్నారు. తమ అభిప్రాయాలను సంబంధిత రుజువులతో సమర్పించాలని సూచించారు. వినతులు విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డెడికేషన్ భవనానికి రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా పంపవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు నేరుగా కూడా అందజేయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 90104 00500 సంప్రదించాలని కోరారు.
పల్టీలు కొట్టిన కారు
– ఇరువురికి గాయాలు
యడ్లపాడు: అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన జాతీయ రహదారిపై యడ్లపాడు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నంద్యాలకు చెందిన కిరణ్ తన స్నేహితుడితో కలిసి గుంటూరు నుంచి ఒంగోలు వైపు కారులో వెళ్తున్నారు. యడ్లపాడు వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీకొట్టింది. కిరణ్, అతని స్నేహితుడికి గాయాలుకాగా, కారు ధ్వంసమైంది. స్థానికులు క్షతగాత్రులను కారు నుండి బయటకు తీశారు. సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.


