దివ్య రథోత్సవం
● స్వామి వారి దివ్యరథానికి ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ పర్యవేక్షణలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచన, వాస్తుమండపారాధన, రథ సంప్రోక్షణ, రథ బలి కార్యక్రమాలను నిర్వహించి అష్టదిక్పాలకుల శాంతి కోసం కుంభంపోసి దీపారాధన చేయటంతో రథోత్సవం ప్రారంభ క్రతువును పూర్తి చేశారు.
● వివిధ రకాల, రంగు రంగుల పచ్చిపూలతో అలంకరించిన దివ్యరథంపై ఉభయదేవేరులతో కూడిన అమరేశ్వరుని కొలువుదీర్చారు.
● స్వామివారి రథోత్సవాన్ని సుమారు నాలుగున్నర గంటలకు ప్రారంభించారు. ఆలయ గాలిగోపురం వద్ద నుంచి మేళతాళాలతో, భక్తుల శివ నామసంకీర్తనలతో, విచిత్ర వేషధారణలతో, నందీశ్వరుడు ముందుండి నడిపిస్తుండగా అత్యంత వైభవోపేతంగా సాగింది.
● వేలాది మంది భక్తులు స్వామి వారి రథాన్ని లాగుతూ గాంధీబొమ్మ సెంటర్ వరకు అక్కడ నుంచి వెనుదిరిగి హరహర మహాదేవా శివనామస్మరణ చేస్తూ భక్తులు రథాన్ని రధశాలలోకి చేర్చారు.
● మండల పరిధి గ్రామాల నుంచే కాక పల్నాడు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో అమరావతి భక్తజన సంద్రమైంది.
● దివ్యరథంలో ఊరేగుతున్న అమరేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు రోడ్లకు ఇరువైపులా ఉన్న భవనాలపై నిలబడిపోయారు.
● ఈ ఉత్సవంలో విచిత్ర వేషధారణలు, నెల్లూరు జిల్లా నుంచి తీసుకువచ్చిన బాజా భజంత్రీలు భక్తులను ఆకర్షించాయి. రథోత్సవాన్ని పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ అచ్చియ్య నేతృత్వంలో సుమారు 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
హరహర మహాదేవా...శంభో శంకర శివపంచాక్షరి నామంతో మార్మోగిన అమరారామం దివ్యరథంలో ఉభయ దేవేరులతో దర్శనమిచ్చిన అమరేశ్వరుడు వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం
అమరావతి: మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా అమరావతి క్షేత్రంలో వేంచేసియున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్య రథోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. అమరావతి, ధరణికోట గ్రామాలకు చెందిన చింకా, ఆలపాటి, కోనూరు వారి వంశస్తులు తమ గుర్రాలకు రంగులు వేసి ఊరేగింపుగా తెచ్చి స్వామి వారికి సమర్పించారు. ఈ గుర్రాలను రథంపై ముందు భాగంలో అలంకరించారు. భక్తులు ఓం నమశ్శివాయః అంటు అమరారామం మార్మోగేలా శివనామస్మరణ చేస్తుండగా మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోఛ్ఛారణల మధ్య ఉభయ దేవేరులతో కూడిన అమరేశ్వరుడిని గాలిగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు.
1/1
దివ్య రథోత్సవం