సమత మమత సమ్మిళితమే రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

సమత మమత సమ్మిళితమే రంజాన్‌

Feb 18 2026 7:22 AM | Updated on Feb 18 2026 7:22 AM

సమత మ

సమత మమత సమ్మిళితమే రంజాన్‌

సమత మమత సమ్మిళితమే రంజాన్‌

‘రోజా’ దైవాదేశం...

ఆత్మశుద్ధికి.. మానవత్వానికి

‘రోజా’ పరిమళం

యడ్లపాడు: రంజాన్‌ అంటే కేవలం 30 రోజుల ఉపవాస దీక్షల పట్టిక కాదు. అది మనిషిలోని స్వార్థాన్ని కరిగించి, మానవత్వాన్ని పరిమళింపజేసే ఒక పవిత్ర యజ్ఞం. ఆకలి విలువను తెలుసుకుంటూ పేదవాడి కన్నీరు తుడిచే ఈ క్రమశిక్షణాయుత ప్రయాణం భక్తులను మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది. ఆధ్యాత్మికత, సామాజిక బాధ్యత, ఆరోగ్య సూత్రాల కలబోతగా సాగే విశిష్టతే రంజాన్‌.

ఇంద్రియ నిగ్రహమే ‘రోజా’

వేకువజామున ‘సహరీ’తో మొదలై, సూర్యాస్తమయం వేళ ‘ఇఫ్తార్‌’తో ముగిసే రోజా దీక్ష కేవలం ఆహారానికి దూరం ఉండటం మాత్రమే కాదు. అది పంచేంద్రియాలపై సాధించే నియంత్రణ.

మతం కన్నా మానవత్వమే మిన్న

అల్లాహ్‌ ఆరాధనలో కఠినత్వం కంటే సౌలభ్యానికే ఇస్లాం ప్రాధాన్యతనిస్తుంది. అందుకే వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అనారోగ్యంతో ఉన్నవారికి ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. చేయలేని వారు తర్వాత రోజుల్లో ‘ఖజా’, లేదా పేదలకు అన్నం పెట్టే ‘ఫిద్యా’ ద్వారా ఆ పుణ్యాన్ని పొందవచ్చు. భక్తి అనేది భారం కాకూడదన్నదే ఇస్లాం ఇచ్చే మానవీయ సందేశం.

మూడు దశల ముక్తిమార్గం

ఈ 30 రోజుల ప్రయాణం మూడు విశిష్ట దశలుగా సాగుతుంది. మొదటి 10 రోజులు సృష్టికర్త అపారమైన కరుణ కోసం ప్రార్థించే రహమత్‌(కారుణ్యం) దినాలు. మధ్య 10 రోజులు చేసిన తప్పులకు క్షమాభిక్ష వేడుకునే మగ్ఫిరత్‌(పాప విముక్తి) సమయం. చివరి 10 రోజులు నరకాగ్ని నుంచి విముక్తిని వేడుకుంటూ ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించే కాలం.

ఐదు స్తంభాల ఆత్మీయ బంధం

ఇస్లాం ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై నిర్మించబడింది. దైవం ఒక్కడేనని నమ్మడం(కలిమా), నమాజ్‌, పేదలకు సహాయపడటం(జకాత్‌), ఉపవాసం(రోజా), స్తోమత ఉంటే చేసే హజ్‌ యాత్ర. ఈ సూత్రాలు మనిషిని ఆధ్యాత్మికంగా పరిపుష్టం చేస్తూ సమాజంలో సమానత్వాన్ని, ప్రేమను పెంపొందిస్తాయి.

జకాత్‌ సంపాదనకు పవిత్రత

రంజాన్‌ మాసంలో ఇచ్చే జకాత్‌ కేవలం దానం కాదు. అది సంపాదనను పవిత్రం చేసుకునే బాధ్యత. ఆస్తిలో 2.5 శాతాన్ని పేదలకు పంచడం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని పెంచుతారు. ఇక పండుగ పూట ఎవరూ ఆకలితో ఉండకూడదని ఇచ్చే ‘ఫిత్రా’, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ‘ఇఫ్తార్‌’ విందులు ఐక్యతకు నిలువెత్తు సాక్ష్యాలు.

లోకానికి మార్గదర్శనం చేసే పవిత్ర ఖురాన్‌ ఈ మాసంలోనే అవతరించింది. ఆ దివ్య గ్రంథం బోధించిన సత్యాలను మననం చేసుకుంటూ, జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి రంజాన్‌ ఒక చక్కని అవకాశం. ఈ 30 రోజుల క్రమశిక్షణ మనిషిని ఆధ్యాత్మికంగా కొత్త పుంతలు తొక్కించి, ఉన్నతమైన జీవనశైలిని అలవరుస్తుంది. ప్రతిముస్లిం రోజాను విధిగా పాటించి అల్లాహ్‌కు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి.

– షేక్‌ అబ్దుల్‌ కలీమ్‌, మత గురువు

సమత మమత సమ్మిళితమే రంజాన్‌ 1
1/1

సమత మమత సమ్మిళితమే రంజాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement