జయపురం: మండీల్లో ధాన్యం అమ్మేందుకు రైతులకు ఇచ్చే టోకెన్లు, రైతులందరికీ సమకూర్చకపోవడంతో జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి పొడాపొదర్ మండీ పరిధి రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి, బీజేడీ రాష్ట్ర కార్యదర్శి రబినారాయణ నందో నేతృత్వంలో జయపురం సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్‌కు జిల్లా ప్రధాన వ్యవసాయ విభాగ అధికారి మానస్ రంజన్ మహాపాత్రో, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్స్ మోనిక రాయ్ సమక్షంలో వినతిపత్రం అందజేశారు. అధికారులు వెంటనే టోకెన్ల సమస్య పరిష్కరించాలని కోరారు. పొడాపొదర్ మండీలో ధాన్యం అమ్మేందుకు గత నెల 26వ తేదీన టోకెన్లు వచ్చాయని, అయినా ఇప్పటికీ సక్రమంగా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ధాన్యం బస్తాలు కప్పేందుకు టార్పలిన్లు గానీ, ధాన్యం ఉంచేందుకు తగిన వసతి గానీ లేకపోవడంతో వర్షాలకు తడిచిపోయే ప్రమాదముందని వాపోయారు. అందువలన తక్కువ ధరకే కొంతమంది బయట అమ్ముకుంటున్నారన్నారు. అధికారులు వెంటనే వాస్తవాలు తెలుసుకొని ఈనెల 20వ తేదీలోగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


