డిచ్‌పల్లి : మండలంలోని సుద్దపల్లి సమీపంలోని సీఎంసీ మెడికల్ కళాశాల వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్రగాయాల య్యాయి. డిచ్‌పల్లి ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరం పాటి గల్లి, ఫులాంగ్‌కు చెందిన మెట్టు రామ్ ధనుష్ (19), నాగారం ప్రాంతానికి చెందిన కచ్చకాయల తేజ ఇద్దరూ డిచ్‌పల్లి మండలం సుద్దపల్లికి పని నిమిత్తం వచ్చారు. అర్ధరాత్రి సుమారు 1 గంటకు తమ బైక్ పై నిజామాబాద్‌కు తిరిగి వెళ్తుండగా సీఎంసీ వద్ద రోడ్డును క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మెట్టు రామ్ ధనుష్ అక్కడికక్కడే మృతి చెందగా, తేజ తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై ఎండీ ఆరిఫ్ ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన తేజను హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. తేజ జిల్లా కేంద్రంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
గాయపడిన తేజ


