పసుపు సాగు సంబురం | - | Sakshi
Sakshi News home page

పసుపు సాగు సంబురం

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

ధర ఇంకా పెరగాలి

పసుపు బోర్డు దృష్టి సారించాలి

పెరుగుతున్న పంట విస్తీర్ణం

ఆశాజనకమైన ధర, పసుపు బోర్డు, పసుపు పరిశోధన కేంద్రంతో ఊతం

మోర్తాడ్‌(బాల్కొండ): జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు పసుపు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో జిల్లాలో 50 వేల ఎకరాల వరకు పసుపు సాగు చేశారు. ఆశించిన ధర లేకపోవడం, పెట్టుబడులు అధికం కావడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. ఏకంగా పసుపు సాగు 50 శాతానికి పడిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పసుపు జాతీయ బోర్డును జిల్లాలోనే ఏర్పాటు చేయడం, పసుపు పరిశోధన కేంద్రం ఇక్కడే ఉండటంతో సాగుకు ఊతమిచ్చినట్లు అయ్యింది. గడచిన సీజన్‌లో పసుపు పంటకు క్వింటాలుకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ధర లభించింది. ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ రకం పంట సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాలతోపాటు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో పసుపు సాగవుతుంది. ఈ సీజన్‌లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, విదేశాలకు పసుపు ఎగుమతులు పెరిగితే సాగు విస్తీర్ణం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది.

జిల్లాలో సాగు విస్తీర్ణం ఇలా...

సంవత్సరం సాగు విస్తీర్ణం(ఎకరాల్లో)

2020–21 41,016

2021–22 40,061

2022–23 21,913

2023–24 24,509

2024–25 23,941

2025–26 28,000

2026–27 30,000 (అంచనా)

పసుపు పంటకు ఇప్పుడు ఉన్న ధర కన్నా ఇంకా ఎక్కువ ధర లభించాలి. పెట్టుబడులు అధికం అవుతున్నాయి. కనీసం ఒక్కో క్వింటాలుకు రూ.16వేల వరకు ధర తగ్గకుండా ఉండాలి. అలా జరిగితేనే సాగు విస్తీర్ణంలో గణనీయమైన మార్పులు వస్తాయి.

– పెద్దకాపు శ్రీనివాస్‌రెడ్డి, రైతు, దోంచంద

పసుపు జాతీయ బోర్డు సాగు విస్తీర్ణంపై దృష్టి సారించాలి. రైతులకు నష్టాలు రాకుండా చూడాలి. మేలు రకమైన విత్తనాల సరఫరా, సేంద్రియ ఎరువుల ధర నియంత్రణ జరగాలి. ఎగుమతులు పెంచి పంటకు గిట్టుబాటు ధర దక్కితేనే ప్రయోజనం.

– గడ్డం లింగారెడ్డి, రైతు, గుమ్మిర్యాల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement