యువకుడిపై దాడి | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై దాడి

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

చికిత్స పొందుతూ యువకుడి మృతి భవన నిర్మాణ కార్మికుడికి గాయాలు వైర్లు పైకెత్తితేనే లారీ కదిలేది

ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు

నందిపేట్‌(ఆర్మూర్‌): ఓ యువకుడిపై దాడి చేసి హత్యాయత్నం చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసిన ఘటన ఆదివారం నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నందిపేట మండల కేంద్రంలోని రాజానగర్‌ దుబ్బ ప్రాంతానికి చెందిన షేక్‌ నయ్యూంకు సమీప బంధువులతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. కాగా, షేక్‌ నయ్యూం ఆదివారం ఉదయం వివేకానంద చౌరస్తా సురేశ్‌ నగర్‌ కాలనీ వద్ద తన అన్న షేక్‌ ఖయ్యూం దుకాణానికి వెళ్లాడు. పాత కక్షలతో ఉన్న సమీప బంధువులైన షేక్‌ తాలీబ్‌, షేక్‌ తాహేర్‌, సాజిద్‌, షాహేద్‌, గాలిబ్‌తోపాటు మరికొంత మంది వ్యక్తులు కారులో వచ్చి ఇనుప రాడ్లు, కత్తులతో షేక్‌ నయ్యూంపై దాడికి పాల్పడ్డారు. దీంతో నయ్యూం తల, చేతులు, పొట్టపై తీవ్రగాయాలయ్యాయి. స్థానికులను చూసి దాడికి పాల్పడిన వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితుడి అన్న షేక్‌ ఖయ్యూం ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్సులో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌ తెలిపారు.

బాన్సువాడ రూరల్‌: ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన జక్కాపురం సందీప్‌(19) ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 13న రాత్రి మృతి చెందినట్లు బాన్సువాడ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌ తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బర్రెల కాపరిగా పనిచేసే సందీప్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, విచారణ కొనసాగుతోందన్నారు.

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కృష్ణ బిల్డింగ్‌ పనులు చేస్తున్న సమయంలో కింద పడడంతో తీవ్రగాయాలైనట్లు కార్మిక సంఘం నాయకులు రజాక్‌ ఆదివారం తెలిపారు. బిల్డింగ్‌ సెంట్రింగ్‌ పనులు చేస్తున్న సమయంలో ఈదురు గాలులు వీయడంతో కృష్ణ భవనంపై నుంచి కింద పడ్డాడు. దీంతో ఎల్లారెడ్డిలో ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కృష్ణను కార్మికసంఘం నాయకులు పరామర్శించారు.

బీబీపేట: పంట వేసిన నుంచి పంట చేతికి వచ్చి రైస్‌మిల్లుకు చేరే వరకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. వడ్ల కొనుగోలు తర్వాత లారీని రైస్‌మిల్లు వద్దకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులు రైతుల మీదనే మోపుతున్నారు. బీబీపేట మండలం మల్కాపూర్‌ గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ఒక లారీలో ముగ్గురు రైతుల వడ్లను లోడ్‌ చేశారు. లారీ గ్రామం నుంచి రైస్‌మిల్లు వరకు వెళ్లే దారిలో సుమారు 5 చోట్ల విద్యుత్‌ వైర్లు కిందికి ఉండడంతో ఆ ముగ్గురు రైతులే వాటిని పైకి లేపు తూ లారీని ముందుకు తీసుకువెళ్లారు. ప్రతిసారి లారీ వచ్చినప్పుడు ఈ తిప్పలు తప్పవని, విద్యుత్‌ అధికారులు స్పందించి వైర్లను సరి చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement