సుభాష్‌నగర్ : వర్షాకాలం నేపథ్యంలో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశముందని, అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్‌పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ తీగలు తెగిపడి కనిపించినా, స్తంభాలు ఒరిగిపోయినా,ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకర స్థితిలో ఉ న్నా వెంటనే సమీప విద్యుత్ అధికారులకు, టోల్ ఫ్రీ నెంబర్ 1912కు సమాచారం అందించాలని కోరా రు. మొబైల్‌లో 8712481489 నెంబర్ ద్వారా వా ట్సాప్‌లోకి వెళ్లి కావాల్సిన సేవలను సులభంగా పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా రైతులకు, గృహ వినియోగదారులకు పలు సూచనలు అందించారు.
వినియోగదారులు ఇవి పాటించండి..
● తడిసిన విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు, సపోర్టు వైర్లు, స్విచ్ బోర్డులు, పరికరాలు ముట్టొద్దు.
● బట్టలు ఆరవేసేందుకు ప్లాస్టిక్ దండెలను మాత్రమే ఉపయోగించాలి.
● రేకులు, మెటల్ షీట్లు, గేట్లు మొదలైన వాటికి విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదమున్నందున వాటిని తాకకుండా జాగ్రత్త వహించాలి.
● సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి తడి చేతులతో మాట్లాడొద్దు. ముందుగా ఛార్జింగ్ ఆఫ్ చేయాలి.
● ఇంటి వైరింగ్‌కు సరైన ఎర్తింగ్ తప్పనిసరి.
● ఐఎస్‌ఐ మార్క్ గల నాణ్యమైన ప్లగ్గులు, స్విచ్‌లు, ఛార్జర్లు మాత్రమే ఉపయోగించాలి.
రైతు సోదరులకు ..
● మోటార్లు, ఫుట్‌వాల్వులు, పైపులు తడిగా ఉన్నప్పుడు తాకొద్దు.
● పంపుసెట్లు, స్టార్టర్లు తప్పనిసరిగా సరైన ఎర్తింగ్‌తో ఉండాలి.
● విద్యుత్ పనులు స్వ యంగా చేయకుండా అర్హత కలిగిన ఎలక్ట్రిషి యన్ ద్వారా మాత్రమే చేయించాలి.
● మోటార్లకు జాయింట్లు లేని నాణ్యమైన సర్వీస్ వైర్లు మాత్రమే వినియోగించాలి.
● పశువులను ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు తీసుకెళ్లొద్దు.
● ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేర్లు చేయొద్దు.
● ఎవరికై నా కరెంట్ షాక్ తగిలితే వెంటనే చేతులతో తాకొద్దు. కర్ర, ప్లాస్టిక్ వంటి విద్యుత్ ప్రసారం కాని వస్తువుతో వేరు చేయాలి.
విద్యుత్ వినియోగదారులు
అప్రమత్తంగా ఉండాలి
అత్యవసర సేవలకు టోల్ ఫ్రీ నెంబర్ 1912కు సమాచారం అందించాలి
ఎన్‌పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు


