● యువకుడి హత్య కేసులో
తండ్రి, తమ్ముడు అరెస్టు
బాన్సువాడ : మద్యానికి బానిసైన కొడుకును హత్య చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ నమ్మించిన తండ్రితోపాటు తమ్ముడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన బాయికాడి లక్ష్మణ్(23) మద్యానికి బానిసై తరుచూ తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధిస్తూ, వారిని కొట్టేవాడు. గత నెల 21న రాత్రి మద్యం సేవించి మత్తులో ఇంటికి వచ్చిన లక్ష్మణ్ తల్లిదండ్రులపై కర్రలతో దాడి చేశాడు. సమాచారం అందుకున్న లక్ష్మణ్ తమ్ముడు బాయికాడి శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో శ్రీకాంత్ పలుమార్లు లక్ష్మణ్ తలపై కొట్టగా అక్కడే ఉన్న తండ్రి బాయికాడి చిన్న గంగారం సైతం కర్రతో లక్ష్మణ్‌ను తీవ్రంగా కొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యను దాచి పెట్టేందుకు రక్తపుమరకలను శుభ్రం చేసి లక్ష్మణ్ బైక్ పైనుంచి పడి చనిపోయాడని నిందితులు చిన్న గంగారం, శ్రీకాంత్ బంధువులు, స్థానికులను నమ్మించారు. ఎవరికీ అనుమానం రాకుండా లక్ష్మణ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. రూరల్ సీఐ తిరుపయ్య, ఎస్సై రాములు విచారణ చేయగా లక్ష్మణ్‌ను తామే చంపామని చిన్న గంగారం, శ్రీకాంత్ అంగీకరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, మృతుడి తల్లి స్వరూప పరారీలో ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర, టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


