● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
● కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా
కమిటీ సమావేశం
నిజామాబాద్ అర్బన్: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదన్నారు. ఈ దిశగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చైతన్యపర్చేందుకు కృషి చేయాలన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలు, ప్రమాదాలకు గల కారణాలపై సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. ఎక్కడ ప్రమాదం జరిగినా, అందుకు గల కారణాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరపాలని, తద్వారా అలాంటి చోట్ల మరోమారు ప్రమాదాలు జరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. పీఎం రహ్‌వీర్, పీఎం రాహత్ కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ రావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల, డీఎంహెచ్‌వో రాజశ్రీ, ఆర్‌అండ్‌బీ ఈఈ అజ్మీర, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఎన్‌ఐసీ అధికారి మధు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్, ఈ–దార్ మేనేజర్ హర్ష, రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


