యూరియా నిల్వలపై పక్కా పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

యూరియా నిల్వలపై పక్కా పర్యవేక్షణ

Jun 10 2026 12:55 AM | Updated on Jun 10 2026 12:55 AM

రైతులు ఆందోళన చెందొద్దు

ఎరువుల కొరత లేదు

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

బోధన్‌: జిల్లాలోని సహకార సంఘాలు, విక్రయ కేంద్రాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. వానాకాలం సీజన్‌ పంటల సాగుకు అవసరమైన ఎరువులు జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జిలాల్లో 27 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఎరువులు అందుబాటులో ఉందని, ఎక్కడా కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు నిల్వలను చేరవేస్తున్నామన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని జానకంపేట సహకార సంఘం ఎరువుల గోదాముతోపాటు ఎడపల్లిలోని విక్రయ కేంద్రం గోదామును కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశారు. యూరియాతోపాటు ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించారు. యూరియా యాప్‌ బుకింగ్‌ యాప్‌ పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముందస్తుగా పంటలు సాగు చేసే బోధన్‌, బాన్సువాడ నియోజక వర్గాల పరిధిలోని రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించామని, నిజామాబాద్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల రైతులకు పక్కాగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

యూరియా బుకింగ్‌ యాప్‌తో ఎలాంటి నష్టం లేదని, ఎరువుల పక్కాదారి పట్టకుండా పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా పంపిణీ దోహదం చేస్తుందన్నారు. నానో యూరియాను కొంత పరిమాణంలో ప్రయోగాత్మకంగా వినియోగించి ఫలితాలను పరిశీలించాలని రైతులకు సూచించారు. నానో యూరియా కొనుగోలు చేయాలని బలవంతం చేయొద్దని, రైతులు కోరిన ఎరువుల మాత్రమే అందించాలన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్‌, తహసీల్దార్‌ దత్తాద్రి, జానకంపేట సొసైటీ చైర్మన్‌ మిద్దె నరేందర్‌, స్థానిక అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement