మోర్తాడ్ (బాల్కొండ): జాతీయ రహదారి 63ను రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లకు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా నష్టపోయే భూములకు పరిహారం ధర నిర్ణయంచడంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరద కాలువ, రైల్వే లైన్‌ల కోసం భూములను త్యాగం చేసిన రైతులే ఇప్పుడు జాతీయ రహదారి విస్తరణలో నష్టపోతుండటం గమనార్హం. ఎంతో విలువైన భూములను కోల్పోతున్నామని పరిహారం ఎక్కువ చెల్లించి ఆదుకోవాల్సింది పోయి భిన్నమైన తేడాలు చూపిస్తున్నారని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కమ్మర్‌పల్లిలో ఒకలాగా...
జగిత్యాల్ జిల్లా సరిహద్దులో ఉన్న గండిహనుమాన్ మందిరం నుంచి కమ్మర్‌పల్లి శివారులోని పాటి హనుమాన్ మందిరం వరకు ఉన్న జాతీయ రహదారిని విస్తరించడానికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూమిని సేకరిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఎకరానికి రూ.కోటికి తగ్గకుండా పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేశారు. దొన్కల్ వద్ద 40 ఎకరాల భూమి ఇరువైపులా నష్టపోతోంది. మోర్తాడ్‌లో 30.154 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. జాతీయ రహదారికి రెండువైపులా భూమి ఒకే వరుస క్రమంలోనే నష్టపోతోంది. అలాంటప్పుడు పరిహారం అన్ని భూములకు ఒకేలాగా ఉండాలని రైతులు అంటున్నారు.
ఒక ఎకరానికి రూ. కోటికి పైగా ధరను పరిహారంగా నిర్ణయించి. మరో ఎకరానికి రూ.10 లక్షలే పరిహారం చెల్లించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
పరిహారం చెల్లింపులో స్వల్ప తేడా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని, 90 శాతం మించి తేడా ఉండటం సరికాదని రైతులు వెల్లడిస్తున్నారు. పరిహారం ధర నిర్ణయించే విషయంలో అధికారులు అన్ని సర్వే నంబర్లకు ఒకే విధానం పాటించకుండా భిన్నమైన తేడాలు చూపడాన్ని నిరసిస్తున్నారు.
నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్న 63 వ నంబర్ జాతీయ రహదారి
రహదారి విస్తరణలో రైతులు కోల్పోనున్న వ్యవసాయ భూములు
ఒక్కో సర్వే నంబర్‌కు ఒక్కో ధర
దొన్కల్ వద్ద భూమిని సేకరించడానికి పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. 502 1ఎఫ్ బీ సర్వే నంబర్ గల భూమికి ఎకరానికి రూ.1,14,31,384 ధరను పరిహారంగా నిర్ణయించారు. ఇదే భూమి పక్కన ఉన్న 500 3 సర్వే నంబర్ గల దానికి రూ.60,54,604 ధరను అవార్డుగా ప్రకటించారు. ఇదే వరుసలో ఉన్న 377 2 ఏ సర్వే నంబర్‌కు మాత్రం రూ.10,91,240 పరిహారంగా చెల్లించారు.
జాతీయ రహదారికి మరో వైపున ఉన్న 508 1సీ 1/2 సర్వే నంబర్ భూమికి రూ.60,54,600 పరిహారం నిర్ణయించారు. ఇదే వరుసలో ఉన్న 534 1ఏ 2 సర్వే నంబర్ గల భూమికి రూ.10,91,240 ధర ప్రకారం పరిహారం చెల్లించారు. మోర్తాడ్‌లోని భూములకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకు వచ్చారు.
రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు
భూసేకరణ వల్ల మాకు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. ఎంతో విలువైన భూములను ఇప్పటికే కోల్పోయాం. మళ్లీ భూములను జాతీయ రహదారికి ఇచ్చి మేము కూలీలుగా మారాల్సి వస్తుంది. కనీసం పరిహారం విషయంలోనూ న్యాయం జరగడం లేదు. – దడివె గంగాధర్, బాధిత రైతు, మోర్తాడ్
భూమికి బదులు భూమి ఇవ్వాలి
వదర కాలువ, రైల్వే లైన్ కు మేమే భూములను కో ల్పోయాం. ఇప్పుడు జాతీ య రహదారికి అంటే మ రింత నష్టపోతాం. భూమి కి బదులు భూమి ఇవ్వాలి. లేదంటే పరిహారం రెండింతలు పెంచాలి. ప్రభుత్వం తీరుపై న్యాయ పోరాటం చేస్తాం.
– దడివె ప్రభుదాస్, బాధిత రైతు, మోర్తాడ్
63వ నంబర్ జాతీయ రహదారి
విస్తరణలో వ్యవసాయ భూములు
కోల్పోతున్న రైతులు
పరిహారం ధర నిర్ణయంలో
తేడాలు
ఓ చోట ఒక ఎకరానికి రూ.1.14 కోట్ల ధర, పక్కనే ఉన్న మరో ఎకరానికి రూ.10.91 లక్షలే
నిర్దిష్టమైన విధానం లేకపోవడంతో
అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి
ఆందోళనలో బాధిత రైతులు


