పెద్దాస్పత్రిలో సిజేరియన్‌లకు సెలవు | - | Sakshi
Sakshi News home page

పెద్దాస్పత్రిలో సిజేరియన్‌లకు సెలవు

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులకు ఇబ్బందులు

ప్రసూతి వైద్యురాలు లేని బోధన్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి

బోధన్‌టౌన్‌(బోధన్‌): పెద్దాస్పత్రిగా పేరు పొందిన బోధన్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వారం రోజులుగా ప్రసూతి వైద్యురాలు లేక అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు వైద్య సిబ్బంది నార్మల్‌ డెలివరీలు మాత్రమే చేస్తున్నారు. శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే ఏమి చేయలేక నిజామాబాద్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రికి పంపిస్తున్నారు. కొందరు బోధన్‌లోనే ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తే, మరి కొందరు ఆర్థిక ఇబ్బందులతో నిజామాబాద్‌ జీజీహెచ్‌కు తరలి వెళుతున్నారు. బోధన్‌లోని జిల్లా ఆస్పత్రి పరిధిలో బోధన్‌, సాలూర, మోస్రా, చందూర్‌, రుద్రూర్‌, వర్ని మండలాలతో పాటు పట్టణ ప్రజలు, పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రజలు వైద్య చికిత్స కోసం వస్తుంటారు. ప్రతి రోజు 500 నుంచి 700 వరకు ఓపీ సేవలు నడువగా, 50 నుంచి 100 మంది వరకు ఇన్‌ పేషెంట్లు చేరుతున్నారు.

తగ్గిన కాన్పులు..

బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మే నెలలో కాన్పులు తగ్గాయి. ఏప్రిల్‌లో సాధారణ కాన్పులు 42, శస్త్ర చికిత్సలు 21 అయ్యాయి. మేలో సాధారణ కాన్పులు 33, శస్త్ర చికిత్సలు 16 అయ్యాయి. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలిని నియమించి వైద్య సేవలు మెరుగు పడేలా చూడాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

త్వరిత గతిన నియమించే ఏర్పాటు చేస్తాం

ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలిని త్వరిత గతిన నియమించే ఏర్పాటు చేస్తాము. ఇప్పటి వరకు ఉన్నత అధికారులకు సమాచారం అందించాం. ఆస్పత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు చేపడుతున్నాం.

– డాక్టర్‌ రాహుల్‌, బోధన్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement