నిరుద్యోగులను వంచించారు...
వెంటనే స్పందించాలి...
మోర్తాడ్(బాల్కొండ) : మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన రాణి స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.2 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. రాయితీ రుణం మంజూరైతే కిరాణ దుకాణం, లేడిస్ ఎంపోరియం ఏర్పాటు చేసుకోవచ్చని ఆశించింది. ఇప్పటి వరకూ యువ వికాసం రుణం మంజూరు కాలేదు. స్వయం ఉపాధి పొందడానికి తనకు రాయితీ రుణం ఒక్కటే మార్గం అని ఆమె భావించింది. ఇది ఒక్క రాణి ఆలోచనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది యువత రాయితీ రుణాల కోసం నిరీక్షిస్తున్నారు.
గత ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువతకు రాయితీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2025 జూన్ 2కు ముందుగానే దరఖాస్తులను స్వీకరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీబంధు, దళితబంధు పథకాలను ఒక్క ఏడాది మాత్రమే అమలు చేశారు. ఎంతో మంది అర్హులు ఉన్నా కొందరికి మాత్రమే లబ్ధి జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా ప్రతి ఏటా రాయితీ రుణాలను పంపిణీ చేసేవారు. రాయితీ కోసం నిధులను కేటాయించడంలో నిర్లక్ష్యం వహించడంతో రాయితీ రుణాల పంపిణీ నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించారు.
జిల్లాలో 58 వేల దరఖాస్తులు...
రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిపొందడానికి జిల్లా వ్యాప్తంగా 58 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దరఖాస్తుదారుల సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆయా కార్పొరేషన్‌ల ద్వారా రాయితీ రుణాలను అందించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌ల ద్వారా ఓసీలను మినహాయించి ఆయా సామాజిక వర్గాల వారికి రాయితీ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
రూ.50 వేలలోపు వారికి వంద శాతం రాయితీ...
రాజీవ్ యువ వికాసం కింద రూ.50 వేల లోపు రుణం కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి వంద శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష వరకు రుణం పొందేవారికి 90 శాతం రాయితీ, రూ.2లక్షల వరకు రుణం తీసుకునేవారికి 80 శాతం రాయితీ, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందేవారికి 70 శాతం రాయితీని అందించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఎక్కువ మంది రూ.4లక్షల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
బడ్జెట్‌లో నిధుల కేటాయింపు...
2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాజీవ్ యువ వికాసం కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటికి పథకం అమలుపై స్పష్టత కరువు కావడంతో రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
రాజీవ్ యువ వికాసం పేరిట రుణాలు ఇస్తామని దరఖాస్తులను స్వీకరించి ఇప్పటి వరకూ నయాపైసా రుణం ఇవ్వలేదు. రాయితీ కోసం నిధులు కేటాయిస్తే నిరుద్యోగులలో కొందరికై నా ప్రయోజనం కలిగేది. – ఉమేష్, ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు
యువత స్వయం ఉపాధి పథకాల విషయంలో నాన్చి వేత ధోరణి సరికాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాయితీ రుణాలను అందించాలి. ఎంతో మంది ప్రభుత్వ సాయం కోసం నిరీక్షిస్తున్నారు.
– పుప్పాల నరేష్, సర్పంచ్, తిమ్మాపూర్
గతేడాది రాయితీ రుణాలను పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం
బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు
కేటాయించినట్లు వెల్లడి
ఇప్పటికీ పథకం అమలుపై స్పష్టత కరువు


