● ఫిర్యాదులు పెండింగ్ పడుతున్నాయ్..
● రెవెన్యూ శాఖవే ఎక్కువ..
● త్వరితంగా పరిష్కరించాలని
బాధితుల వేడుకోలు
నిజామాబాద్‌అర్బన్ : అధికారులు తమ సమస్యలను పరిష్కరిస్తారని గంపెడాశతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారు. సంబంధిత అధికారులకు తమ విన్నపాలను సమర్పిస్తున్నారు. అయితే జిల్లా అధికారులను నేరుగా కలిసి సమస్యను విన్నవించినా పరిష్కారం కావడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా ప్రజావాణిలో సమర్పించిన అనేక ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇందులో రెవెన్యూ శాఖకు చెందిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి.
నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 54, డిచ్‌పలి్‌ల్ తహసీల్‌లో 35, పొతంగల్ తహసీల్‌లో 34, ఆర్మూరు రెవెన్యూ డివిజన్‌లో 27, కోటగిరి తహసీల్‌లో 24. ఆర్మూర్ తహసీల్‌లో 20 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రజా వాణిలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌లు, జిల్లా అధికారులు పాల్గొంటున్నారు. అక్కడే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఫిర్యాదు దారుల సమస్యలపై ఉన్నతాధికారులు సంబంధిత మండల అధికారులతో నేరుగా మాట్లాడి పరిష్కరించేందుకు అవకాశం ఉంది. ఈ పద్ధతిని ఏర్పాటు చేస్తే బాధితులకు తక్షణమే న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొందరు బాధితులు వ్యక్తిగత విషయాలను, కుటుంబ తగాదాలను ప్రజావాణిలో విన్నవిస్తున్నారు. వీటివల్ల అధికారులకు సమయం వృథా అవుతోంది. వీటిపై ఫిర్యాదు దారులకు అవగాహన కల్పిస్తే మళ్లీ రాకుండా ఉంటారు.


