ఇక బోగస్‌ పింఛన్లకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఇక బోగస్‌ పింఛన్లకు చెక్‌

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో పింఛన్ల పంపిణీ విషయంలో ఇక నుంచి ప్రభుత్వం లైవ్‌ అథెంటిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించనుంది. ఇందులో భాగంగా పింఛనుదారులు బతికే ఉన్నట్లు సంబంధిత సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో నేరుగా బ్యాంకు ఖాతాలో పింఛన్ల డబ్బులు జమ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ లైవ్‌ అథెంటిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది. పింఛన్ల లబ్ధిదారులు మరణించినప్పటికీ నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో అధికారులు ఆయా పేర్లను తొలగించకపోవడంతో పాటు మరోవైపు పలుచోట్ల బోగస్‌ పింఛన్లకు సైతం డబ్బులు జమ అవుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో కలిపి 46,473 మంది పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారు.

● ఇకపై ఏమాత్రం తేడా లేకుండా బతికి ఉన్నవారికి మాత్రమే పింఛన్లు అందించాలనే లక్ష్యంతో ‘కోర్‌ బ్యాకింగ్‌ సొల్యూషన్‌’ (సీబీఎస్‌) అనే మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు, బిల్‌ కలెక్టర్లు, ఇతర సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి లబ్ధిదారులు బతికే ఉన్నట్లుగా వారి ఫొటోలను యాప్‌లో నమోదు చేస్తున్నారు.

● లైవ్‌ అథెంటిఫికేషన్‌ ప్రక్రియను మే 15న మొదలు పెట్టారు. దీన్ని ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు పెట్టింది. జిల్లాలో ఇప్పటివరకు 60 శాతం మేర పింఛన్‌ లబ్ధిదారులకు సంబంధించి లైవ్‌ అథెంటిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. గడువు సమీపిస్తుండడంతో మిగిలిన వారికి సంబంధించి కూడా త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి పెడుతున్నారు. కాగా ప్రతి మున్సిపాలిటీలోని పింఛన్‌ లబ్ధిదారులందరికి సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి లైవ్‌ అథెంటిఫికేషన్‌ చేయాలని, అలా చేస్తేనే పింఛన్ల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రతి మూడు నెలలకోసారి

అథెంటిఫికేషన్‌ ప్రక్రియ

అన్ని మున్సిపాలిటీల్లో క్షేత్రస్థాయిలో యాప్‌లో నమోదు

మరణించినవారి ఖాతాల్లో పింఛన్లు

జమ కాకుండా చర్యలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement