యూరియా రాలేదని సొసైటీకి తాళం వేసిన రైతులు
డొంకేశ్వర్(ఆర్మూర్) : ఖరీఫ్ సాగు సీజన్ మొదలు కావడంతో రైతులకు యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. మొన్నటి వరకు మూసి ఉన్న ‘యూరియా బుకింగ్ యాప్’ను కూడా ప్రభుత్వం తెరిచింది. దీంతో పలు మండలాల్లో రైతులు యాప్ ద్వారా బస్తాలను బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే, ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే ప్రభుత్వం పరిమితి పెట్టింది. అదనపు బస్తాలకు బుక్ చేస్తే యాప్ తీసుకోవడం లేదు. దీంతో రైతులే కాకుండా సొసైటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. బస్తాల పరిమితి పెంచాలని కోరుతున్నారు. గడిచిన వారం రోజుల్లో జిల్లాలో యాప్ ద్వారా 4,634 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 5.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 4.38 లక్షల ఎకరాల వరకు వరి సాగయ్యే అవకాశం ఉంది. రైతులు ఎకరం వరికి మూడు బస్తాలకు పైగా యూరియా వేస్తున్నారు. ఎకరానికి రెండు బస్తాలే ఇవ్వడంతో మూడో డోసు సమయంలో నానో యూరియా వాడాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు. తద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి అన్నారు. సాగు ఊపందుకున్న తర్వాత ఎకరానికి మూడు బస్తాలకు పెంచే అవకాశం ఉందని తెలిపారు.
సరిపడా యూరియా నిల్వలు...
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా యూరియా దిగుమతి ప్రభావం ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. దిగుమతిలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ జిల్లాకు మాత్రం అవసరమైన యూరియాను వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు తెప్పిస్తోంది. ఖరీఫ్‌లో 80,857 మెట్రిక్ టన్నులు అవసరం అవుతుందని ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టిన అధికారులు ఇప్పటి వరకు జిల్లాకు 32,462 మెట్రిక్ టన్నులు తెప్పించారు. పది రోజుల్లో రెండు సార్లు జిల్లాకు రైలు వ్యాగన్లలో యూరియాను తెప్పిస్తున్నారు. వచ్చిన దానిని సొసైటీలకు, దుకాణాలకు రవాణా చేస్తున్నారు.
పెర్కిట్(ఆర్మూర్): యూరియా కోసం గంటల తరబడి వేచి చూసి చివరకు దొరక్క పోవడంతో శనివారం పెర్కిట్ సొసైటీకి రైతులు తాళం వేసి ఎదుట ఆందోళనకు దిగారు. ఆర్మూర్ ము న్సిపల్ పరిధిలోని పెర్కిట్ సొసైటీ పరిధిలో పె ర్కిట్‌తో పాటు కొటార్మూర్, చేపూర్ గ్రామాలు ఉన్నాయి. కాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు యూరియా కోసం ఉదయం పె ర్కిట్ సొసైటీకి వచ్చారు. సొసైటీలో 450 బస్తా ల యూరియా ఉందని సొసైటీ సిబ్బంది తెలిపారు. దీంతో రైతులు ప్రత్యేకంగా ఏర్పాటు చే సిన యాప్‌లో యూరియా కోసం బుక్ చేసుకు నే ప్రయత్నం చేయగా సాంకేతిక సమస్య తలెత్తింది. కొద్దిసేపటికి యాప్‌లో సాంకేతిక సమ స్య తొలగిపోయిన నిమిషాల్లోనే కొందరు రైతు లు యూరియాను బుక్ చేసుకుని తీసుకెళ్లారు. అప్పటి వరకు వేచిచూసిన మిగిలిన రైతులకు యూరియ లభించకపోవడంతో ఆగ్రహంతో సొసైటీకి తాళం వేసి ఆందోళనకు దిగారు. యాప్‌ను తొలగించి మామూలుగా పద్దతిలో యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సొసైటీ వద్దకు చేరుకుని రైతులను శాంతింపజేసి అందరికి యూరియా వచ్చేలా చేస్తామని హామి ఇవ్వడంతో రైతులు శాంతించారు.
తెరుచుకున్న యూరియా బుకింగ్ యాప్
ప్రణాళిక బద్ధంగా పంపిణీకి
వ్యవసాయ శాఖ చర్యలు
ఖరీఫ్‌కు అవసరమైన బస్తాలు
ఎప్పటికప్పుడు జిల్లాకు దిగుమతి


