● వైద్యులు, సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా వైద్యాధికారి రాజశ్రీ
● ఆర్మూర్ సీహెచ్‌సీతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీకాల సెంటర్ల తనిఖీ
ఆర్మూర్ : ఆర్మూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులు, ల్యాబ్‌లు, మందుల పంపిణీ కేంద్రాలు, హెచ్‌ఐవీ, ఐసీటీసీ కేంద్రాన్ని, ట్రూ నాట్ టీబీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి సూచనలు చేసారు. అదేవిధంగా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందికి విధులు కేటాయించిన రికార్డులను, హాజరు పట్టికలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం పట్టణంలోని మగ్దుంనగర్ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు టీకాలు ఇచ్చే కేంద్రాన్ని సందర్శించారు. పిల్లలకు ఇస్తున్న టీకాలు, వ్యాక్సిన్‌ను పరిశీలించారు. పుట్టిన ప్రతి శిశువు నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలకు వారి వయసు వారిగా ఇవ్వాల్సిన డోసులను సక్రమంగా అందజేయాలని ఆదేశించారు. ఒక రోజు ముందు డ్యూ లిస్ట్‌ని తయారు చేసుకోవాలని సూచించారు. ఆర్‌ఎంవో డాక్టర్ అమృత్‌రామ్‌రెడ్డి, వైద్యులు, సతీష్, ప్రవీణ్, సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆరోగ్య అధికారి శేఖర్, ఆరోగ్య కార్యకర్తలు శ్యామల, సౌందర్య తదితరులున్నారు.


