లక్ష్యం.. 10 శాతం పెంపు | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. 10 శాతం పెంపు

Jun 6 2026 1:59 AM | Updated on Jun 6 2026 1:59 AM

‘సర్కారు బడుల్లో 10 శాతం అడ్మిషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ ఏడాది జిల్లాలో 10 వేల మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు లక్ష్యం పెట్టుకున్నాం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా లక్షా 10 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. ఈ నెల 12 నుంచి తరగతులు పున:ప్రారంభమవుతాయి. పుస్తకాలు, నోట్‌బుక్స్‌ విద్యార్థులకు అందిస్తాం. ప్రతి బడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తూనే నాణ్యమైన బోధన చేసేలా చర్యలు తీసుకుంటాం.’ అని చెప్తున్న డీఈవో పార్శి అశోక్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... – ఖలీల్‌వాడి

● మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది..

● జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. నిర్వాహకుల జీతాలతోపాటు వంట సామగ్రికి సంబంధించిన ఖర్చులను నెలవారీగా ఖాతాలో జమ చేస్తున్నాం. నాణ్యమైన భోజనంతోపాటు విద్యార్థులకు టిఫిన్స్‌, రాగి జావా, పాలు అందిస్తున్నాం.

10 వేల మంది విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో

చేర్పించేందుకు కృషి

స్కూళ్ల ప్రారంభం నాటికే పుస్తకాలు అందిస్తాం

మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం

‘సాక్షి’తో డీఈవో పార్శి అశోక్‌

సాక్షి : జిల్లాకు పుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాంలు వచ్చాయా?

విద్యాశాఖ అధికారి : జిల్లాకు 6,92,650 పుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 6 లక్షల 5వేల 950 పుస్తకాలు వచ్చాయి. మిగతా పుస్తకాలు స్కూళ్లు ప్రారంభం వరకు వస్తాయి. పుస్తకాలను మండలాలకు పంపించాం. నోట్‌బుక్స్‌ మండల విద్యాశాఖ అధికారులకు నేరుగా అందజేశారు. యూనిఫాంలను కూడా అందిస్తాం.

● ఎన్ని ప్రీ ప్రైమరీ స్కూళ్లు మంజూరయ్యాయి? సిబ్బంది నియామకం?

● గత విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభించాం. జిల్లాలో 68 ఏర్పాటు చేయగా, ఐదు పీఎంశ్రీ స్కూళ్లలో కొనసాగాయి. ఈ విద్యాసంవత్సరం 112 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నెల 10 వరకు సిబ్బందిని నియమిస్తాం. స్థానికులకే అవకాశం కల్పిస్తాం.

● విద్యార్థుల సంఖ్య తగ్గకుండా తీసుకుంటున్న చర్యలు..

● బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచే లా ప్రత్యేక దృష్టి పెట్టాం. ఈ విద్యా సంవత్సరం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10 శాతం విద్యార్థులను పెంచాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హెడ్‌మాస్టర్లకు వివరించాం. ఈ ఏడాది కొత్తగా జిల్లాలో 10 వేల మంది విద్యార్థులను బడుల్లో చేర్పిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్య మంతోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. తల్లిదండ్రులు గమనించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి.

శిథిల బడులపై దృష్టి..

జిల్లాలో ఎన్ని శిథిల బడులు ఉన్నాయో గుర్తించి ప్రణాళిక సిద్ధం చేశాం. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నవాటిని తొలగించాలని హెచ్‌ఎంలకు ఆదేశాలిచ్చాం. వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు చర్యలు చేపడతాం. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి స్కూల్‌ నుంచి ఎంఈవో ద్వారా డీఈవో ఆఫీస్‌కు వస్తే నిధుల కోసం నివేదిస్తాం.

టీచర్ల కొరతను ఎలా అధిగమిస్తారు..

టీచర్ల కొరత అంతగా లేదు. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఉండవు. జిల్లాలో సుమారు 400 వరకు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అవసరం ఉన్న పాఠశాలలకు టీచర్‌లను సర్దుబాటు చేస్తాం.

విధులకు రాని టీచర్లపై తీసుకునే చర్యలు ..

స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయాలి. ఫేషియల్‌ అటెండెన్స్‌ ద్వారా సమయపాలన పాటించని వారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement