● బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను
వెంటనే అందించాలి
● రాజకీయ పార్టీల ప్రతినిధుల
సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పారదర్శకమైన ఓట రు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జా బితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పా ర్టీలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరా రు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలు విధానం, జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల ను కలెక్టర్ వివరించారు. మరణించిన వారి పేర్ల తొలగింపు, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించడం, అర్హులైన కొత్త ఓటర్ల పేరును జాబితాలో చేర్చడం కోసమే ఎస్‌ఐఆర్ జరుగుతోందన్నారు. నిజామాబాద్ అర్బన్ మినహా మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 90 శాతం ప్రీ–మ్యాపింగ్ పూర్తయ్యిందని, అర్బన్ సెగ్మెంట్‌లో 68 శాతం జరిగిందని వివరించారు. జూన్ 25 నుంచి క్షేత్రస్థాయిలో జరుగనున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని, ప్రతి ఓటరు తప్పనిసరిగా మ్యాపింగ్ చేసుకునేలా చొరవ చూపా లని కోరారు. ఎస్‌ఐఆర్ అమలులో బీఎల్‌వోలతోపాటు బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కూడా అత్యంత క్రియాశీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నెల 15 నుంచి 24వ తేదీలోపు బీఎల్‌ఏలు, బీఎల్‌వోలకు ఎ స్‌ఐఆర్ అమలు తీరుపై శిక్షణా తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేపడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓటరు పేరుతో ముద్రితమై ఉండి, క్యూఆర్ కోడ్ కలిగిన ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారని, ప్రతి ఓట రు తప్పనిసరిగా ఆ ఫారంలోని వివరాలను పూరించి తిరిగి బీఎల్‌వోలకు అందించేలా చొరవ చూ పాలని కోరారు. బీఎల్‌వోల నుంచి ఓటీపీలు తీసుకొని బీఎల్‌ఏలు ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టకూడదని, అది నేరంగా పరిగణించబడుతుందన్నారు. ఎస్‌ఐఆర్ షెడ్యూల్ ప్రకారం జూలై 24న పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందని, 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురిస్తామని వివరించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. అభ్యంతరాలు, క్లెయిములను సెప్టెంబర్ 28 వరకు పరిష్కరించి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, వివిధ రాజకీయపార్టీల నాయకులు పాల్గొన్నారు.


