చెనాతో ముప్పు పొంచే వుంది: ఆర్మీ చీఫ్‌

We will come out victorious in case of war with China - Sakshi

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో చైనా నుంచి ముప్పు పొంచేఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణే అన్నారు. రానున్న ఆర్మీ డేను పురస్కరించుకొని బుధవారం నరవణే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరిహద్దు భూభాగాలకు సంబంధించి చైనా కొత్తగా తీసుకొచ్చిన చట్టం మూలంగా తలెత్తే పర్యవసానాలను ఎదుర్కొనడానికి సంసిద్ధులై ఉన్నామన్నారు.

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయడానికే కట్టుబడి ఉన్నామని నరవణే చెప్పారు. నియంత్రణ రేఖకు అవతలి వైపున (పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో) 350 నుంచి 400 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి క్యాంప్‌ వేశారని, పదేపదే చొరబాటుయత్నాలు చోటుచేసుకోవడం శత్రుదేశం నీచమైన ఉద్దేశాలను ఎత్తిచూపుతున్నాయని పేర్కొన్నారు. డిసెంబర్‌ 4న నాగాలాండ్‌లో పొరపాటున పౌరులపైకి సైనికులు కాల్పులు జరిగిన ఘటనపై ఆర్మీ విచారణ నివేదిక ఒకటి, రెండు రోజుల్లో అందవచ్చని తెలిపారు.

హాట్‌స్ప్రింగ్స్‌ నుంచి వెనక్కి మళ్లండి
తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి (పెట్రోలింగ్‌ పాయింట్‌ 15) సాధ్యమైనంత త్వరగా చైనా బలగాలు వెనక్కి మళ్లాలని భారత్‌ గట్టిగా డిమాండ్‌ చేసింది. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు అవతలి వైపున చైనా భూభాగంలో బుధవారం భారత్‌– చైనాల మధ్య 14వ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top