హత్యా బెదిరింపులు.. గవర్నర్‌ ఉక్కిరిబిక్కిరి

Tamil Nadu Governor Meets With President - Sakshi

ఢిల్లీ పెద్దలతో మూడు రోజులుగా భేటీ

గవర్నర్‌ హోదా అంటే పూలపాన్పు కాదు.. పదునైన ముళ్లపై పాదరక్షలు లేని కాలినడకేనని తమిళనాడు గవర్నర్లకు తరచూ అనుభవం ఎదురవుతోంది. తాజాగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ సైతం అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకోలేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. చివరకు బదిలీ అయ్యేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలతో వరుస భేటీలపై ఆంతర్యమేమిటోనన్న ప్రశ్న తలెత్తుతోంది.

సాక్షి, చెన్నై : వేర్వేరు రాష్ట్రాల వారు తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన వారిలో అధికశాతం కత్తిమీద సాము పరిస్థితిని ఎదుర్కొన్నారు. లౌక్యం తెలిసిన ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ప్రభుత్వంపై మింగుడు పడలేకపోయారు. ప్రస్తుత గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌కు సైతం అదే పరిస్థితులు ఎదరయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్‌ బిల్లుపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్‌ జాప్యం చేయడంతో అధికార, ప్రతిపక్షాలు ఆయనపై ఒత్తిడి తెచ్చాయి. గవర్నర్‌ ఆమోదముద్ర కోసం వేచిచూడకుండా రిజర్వేషన్‌పై ప్రభుత్వం జీఓ జారీచేసింది. దీంతో మరో ఆలోచనకు తావివ్వకుండా విధిలేని పరిస్థితుల్లో గవర్నర్‌ ఆమోదించారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులోని ఏడుగురు శిక్షా ఖైదీల విడుదలపై గవర్నర్‌ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.

రెండేళ్లయినా ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ అభీష్టంతో నిమిత్తం లేకుండా గవర్నరే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల నియామాకాన్ని చేశారు. ఈ వీసీల్లో కొందరు ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అన్నావర్సిటీ వీసీ సూరప్ప, ప్రభుత్వం మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ కారణంగా గవర్నర్‌ పేరు కూడా రచ్చకెక్కింది. ఇలా తమిళనాడులో జరిగే అనేక వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం తెరపైకి రావడంపై కేంద్రం అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ బదిలీకి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పైగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో వివాదాల్లో చిక్కుకున్న బన్వరిలాల్‌ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వెళ్లేందుకా..కొనసాగేందుకా? 
అనేక అంశాల మధ్య నలుగుతున్న గవర్నర్‌ బన్వరిలాల్‌ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. మూడు రోజులుగా ఢిల్లీలో తిష్టవేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, పార్లమెంటు వ్యవహారాల మంత్రిని ఇప్పటికే కలిశారు. శుక్రవారం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. గవర్నర్‌ అకస్మాత్తుగా ఢిల్లీ ప్రయాణం వెనుక కారణాలపై అన్వేషణ సాగుతోంది. బదిలీ కోసమా లేక కేంద్రంలో బదిలీ ఆలోచనలకు తెరదించి తమిళనాడులోనే కొనసాగేందుకా ఈ ఢిల్లీ పర్యటన అని చర్చ మొదలైంది.
   
అన్నావర్సిటీ వీసీకి హత్యా బెదిరింపులు 
అన్నాయూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ సూరప్ప హత్యాబెదిరింపులకు గురయ్యారు. అన్నా వర్సిటీకి ప్రత్యేక అంతస్థు కోరుతూ కేంద్రప్రభుత్వానికి ఆయన ఇటీవల లేఖ రాయడం కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రానికి లేఖరాసిన ఆయనను వీసీ బాధ్యతల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు, అనేక వర్గాలు డిమాండ్‌ చేయడం ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీసీ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ అన్నావర్సిటీకి ప్రత్యేక అంతస్తు అవసరం లేదని కేంద్రానికి లేఖరాసింది. ఈ వివాదాల నేపథ్యంలో వీసీ సూరప్పను తుపాకీతో కాల్చి చంపుతానని వీరప్పన్‌ అనే పేరుతో వర్సిటీకి ఒక ఉత్తరం చేరింది. చెన్నై కొట్టూరుపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top