అది ‘పెగసస్‌’గా నిర్ధారించలేం

Supreme Court says no conclusive proof of Pegasus spyware - Sakshi

సుప్రీంకోర్టు ధర్మాసనానికి టెక్నికల్‌ ప్యానెల్‌ నివేదిక 

29 ఫోన్లను పరీక్షిస్తే.. 5 ఫోన్లలో ఒకరకం మాల్‌వేర్‌ 

దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు  

ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగాన్ని నెలకొల్పాలి

న్యూఢిల్లీ:  ఇజ్రాయెల్‌ స్పైవేర్‌ పెగసస్‌ను కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా ఉపయోగిస్తోందంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్‌ ప్యానెల్‌ తన నివేదికను ధర్మాసనానికి అందజేసింది. 29 ఫోన్లను పరీక్షించగా, కేవలం 5 ఫోన్లలో ఒకరకం మాల్‌వేర్‌ను గుర్తించినట్లు నివేదికలో వెల్లడించింది. అయితే, అది నిజంగా ఇజ్రాయెల్‌ పెగసస్‌ స్పైవేర్‌ అవునో కాదో నిర్ధారణకు రాలేకపోతున్నట్లు పేర్కొంది. పెగసస్‌ అంశంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఆక్షేపించింది.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ నేతృత్వంలోని ప్యానెల్‌ తన నివేదికను తాజాగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి అందజేసింది. అందులోని వివరాలను ధర్మాసనం గురువారం బయటపెట్టింది. ‘‘దర్యాప్తునకు కేంద్రం సహకరించలేదని కమిటీ(ప్యానెల్‌) చెప్పింది. పెగసస్‌ విషయంలో కోర్టులో విచారణకు మీరు(కేంద్రం) సహకరించలేదు. కమిటీకి సహకరించలేదు’ అని పేర్కొంది. పౌరుల గోప్యత హక్కు రక్షణ, సైబర్‌ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఇప్పుడున్న చట్టాలను సవరించాలని సూచించిందని వివరించింది.  

నివేదికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తాం
పరీక్ష కోసం టెక్నికల్‌ కమిటీకి 29 ఫోన్లు అందజేయగా, అందులో 5 ఫోన్లలో మాల్‌వేర్‌ కనిపించడం కొంత ఆందోళనకరమైన విషయమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. 29 ఫోన్లు ఇచ్చిన వారికి ఈ నివేదికను అందజేయలేదని చెప్పారు. సైబర్‌ సెక్యూరిటీ, చట్టవిరుద్ధమైన నిఘా, పౌరుల గోప్యత విషయంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్యానల్‌ ప్రతిపాదించిందని చెప్పారు. నివేదికను విడుదల చేయొద్దంటూ ప్యానల్‌ తమను కోరిందన్నారు.

ఇవన్నీ సాంకేతికపరమైన అంశాలని, నివేదికలో ఏయే భాగాలను బహిర్గతం చేయాలో తాము నిర్ణయిస్తామని, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని వివరించారు. ప్యానెల్‌ నివేదికను కక్షిదారులకు అందజేయాలని సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్, రాకేశ్‌ త్రివేది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. దర్యాప్తునకు కేంద్రం సహరించలేదని ధర్మాసనం చెప్పగా, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందించారు. ఆ విషయం తనకు తెలియదని బదులిచ్చారు. ధర్మాసనం తదుపరి విచారణకు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

రాహుల్‌ క్షమాపణ చెబుతారా?: బీజేపీ   
పెగసస్‌ వ్యవహారంలో ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు దుష్ప్రచారం సాగించాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ఇకనైనా క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, స్వయం ప్రకటిత మేధావులు, కొన్ని ప్రభుత్వేతర సంస్థలు, ఓ వర్గం మీడియా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేశాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ ఇన్నాళ్లూ అబద్ధాలు ప్రచారం చేసినట్లు తేటతెల్లమయ్యిందన్నారు.

కేంద్రం ఏదో దాస్తోంది: రాహుల్‌
పెగసస్‌ ఉదంతంలో కేంద్ర ప్రభుత్వంతో ఏదో దాచేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌కు మోదీ ప్రభుత్వం సహకరించలేదని తప్పుపట్టారు. దీన్నిబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తెలిసిపోతోందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని మోదీ సర్కారు కోరుకుంటోందన్నారు. దర్యాప్తునకు సహకరించలేదంటే ఏదో నిజాన్ని దాస్తున్నట్లు అంగీకరించినట్లేనని చెప్పారు. ఈ మేరకు రాహుల్‌ గురువారం ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top