వైద్య పరీక్షల అనంతరం ఢిల్లీకి చేరిక

Sonia Gandhi Returns From US After Medical Check up - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం భారత్‌కు చేరుకున్నారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోనియా తన కుమారుడు రాహుల్‌ వెంటరాగా ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మెడికల్‌ చెకప్‌ కోసం ఈనెల 12న అమెరికా వెళ్లారని, కోవిడ్‌-19 నేపథ్యంలో తరచూ నిర్వహించే వైద్య పరీక్షల్లో జాప్యం చోటుచేసుకుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్‌ వేగంగా ప్రబలుతున్న క్రమంలో కొద్దిరోజులే జరగనున్న పార్లమెంట్‌ సమావేశాలకు సోనియా, రాహుల్‌ ఇప్పటివరకూ హాజరుకాలేకపోయారు. వ్యవసాయ బిల్లులపై పాలక, విపక్ష సభ్యుల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో సోనియా గాంధీ దేశంలో అడుగుపెట్టారు.

రాజ్యసభలో ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం విపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేయగా, సస్పెన్షన్‌ వేటుకు గురైన సభ్యులు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం కోరింది. సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేసేవరకూ తాము సభను బహిష్కరిస్తామని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతుల నుంచి ప్రైవేట్‌ వ్యక్తులు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయకుండా నిలువరించేలా మరో బిల్లు తీసుకురావాలని ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. కాగా వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో ఆదివారం అనుచితంగా వ్యవహరించిన ఎనిమిది మంది సభ్యులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్‌ అయిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్‌ సతవ్‌, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌, రిపున్‌ బొరేన్‌లున్నారు. చదవండి : మనాలికి కంగన.. ‘సోనియా సేన’పై ఫైర్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top