అశ్లీల దృశ్యాలే కారణం: శివానంద్‌ తివారీ

Porn Content On Phones Prepare Mindset For Rape Says RJD Leader - Sakshi

రాంచీ: జార్ఖండ్‌లో జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ స్పందించారు. సమాజంలో అత్యాచారాలు పెరగడానికి మొబైల్‌ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు లభించడమే కారణమని అన్నారు. సినిమాలలో ఐటెమ్‌సాంగ్స్‌, ఫోన్లలో అశ్లీల వీడియోలు లైంగిక దాడులు జరగడానికి ముఖ్య కారణమని, ఇలాంటివి ఉన్నంతకాలం చట్టాలు కూడా ఈ దారుణాలను ఆపలేవని పేర్కొన్నారు. ఎలాంటి అత్యాచారాలు, నేరాలు జరగని గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరగడం అక్కడ సంస్కృతిని నాశనం చేస్తున్నాయన్నారు. ‘‘గిరిజన ప్రాంతంలో మహిళలపై అత్యాచారం జరుగుతుందని ఎవరూ ఊహించరు. గిరిజన సంస్కృతిలో అత్యాచారాలు అనేవి ఇంతవరకు జరగలేదు. కాని ఆధునిక యుగం మొదలయ్యాక ప్రస్తుత మహిళలను ఆట బొమ్మలాగా చూస్తున్నారు’’ అని తివారీ పేర్కొన్నారు.

కాగా జార్ఖండ్‌లోని డుమ్కాలో 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందనే ఆరోపణలు రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా సంచలనం సృష్టించిన విషయం విధితమే. మంగళవారం సాయంత్రం డుమ్కా జిల్లాలోని ముఫాసిల్ ప్రాంతంలో మహిళపై 17 మంది సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితురాలి భర్తను కట్టేసి అత్యాచారం చేశారు. అనంతరం మహిళ ఫిర్యాదు చేయగా, నిందితుల్లో ఒకరిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి జార్ఖండ్ ప్రభుత్వాన్ని నిందించారు. ఇది జార్ఖండ్ ప్రభుత్వం తప్పు అని, అత్యాచారాల నిషేదానికి చట్టాలు తీసుకొచ్చి వాటిని అమలు చేయాలన్నారు. నిందితులను కఠినంగా శికక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించి ఈ అత్యాచారాన్ని సుమోటోగా గుర్తించింది. లైంగిక వేధింపుల కేసుల్లో 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఎంహెచ్‌ఏ మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ జార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో చర్య తీసుకున్న సమగ్ర నివేదికను కూడా కోరింది. బాధితురాలు మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఘటన జరిగిందని, దర్యాప్తు పప్రారంభించినట్లు డీజీపీ సుదర్శన్ మండల్ తెలిపారు. వైద్య పరీక్ష నిమిత్తం బాధితురాలిని హాస్పటల్‌కి పంపామని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top