ఆధారాలు కోర్టు ముందు పెట్టడంలో రేవంత్ సర్కార్ విఫలం: జి.కిషన్‌రెడ్డి
సాక్షి న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని చట్టపరంగా కోర్టు ముందు సమర్థవంతంగా ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే అవినీతి కేసుల్లో చట్టబద్ధమైన, పారదర్శకమైన చర్యలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘ఎన్నికల హామీలు ఎందుకు అమలు కాలేదు? అవినీతి కేసుల్లో చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? మీ ప్రభుత్వం, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాలే కాబట్టి.. దొంగలుదొంగలు కలిసి తెలంగాణను దోచుకోవడంలో పోటీపడుతూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? అనే అంశాలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా, కేసీఆర్ కుటుంబంపై కానీ, గత ప్రభుత్వ అక్రమాలపై కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
‘నేను గిచ్చినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి’అన్న చందంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి రాగానే.. కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద హామీలిచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా.. ఏ ఒక్క అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు, చర్యలు తీసుకోలేదని కిషన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.


