చెన్నై: ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిగ ఉదయనిధి కోరారు. చెన్నైలోని జస్టిస్ బషీర్ అహ్మద్ సయీద్ మహిళా కళాశాలలో కుటుంబ సభ్యులతో పాటు ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. "మీరు బయటకు వచ్చి ఓటు వేయండి. నేను గత 25 ఏళ్లుగా ఇదే చేస్తున్నాను. నా కుమారుడు ఇన్బానిథి మొదటిసారి ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్నాడు" అని తెలిపారు. తన అత్తమామలు దుర్గ, స్టాలిన్‌తో పాటు భర్త ఉదయనిధితో కలిసి ఆమె ఓటు వేశారు. కాగా, కృతిగ- ఉదయనిధి స్టాలిన్ దంపతులకు ఇన్బానిథితో పాటు కూతురు తన్మయ ఉన్నారు.
మా అబ్బాయి కూడా.. ఫస్ట్ టైమ్ ఓటు వేస్తున్నాడు: దయానిధి మారన్
తన కుమారుడు కూడా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నాడని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వెల్లడించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. "నా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి, ఓటు వేయడానికి నేను నా కుటుంబంతో వచ్చాను. నా కుమారుడు మొదటిసారి ఓటు వేస్తున్నాడు. అతడు కూడా తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉన్నాడు. సుపరిపాలన కొనసాగుతుందని, తమిళనాడు విజయం సాధిస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది 'చెడు' ఢిల్లీకి, 'మంచి' తమిళనాడుకు మధ్య జరుగుతున్న యుద్ధం'' అని అన్నారు.
ఆలోచించి ఓటు వేశా: కరణ్ దయానిధి మారన్
తన రాజ్యాంగబద్దమైన హక్కును వినియోగించుకోవడం తనకు ఉత్సాహాన్ని కలిగించయిందని కరణ్ దయానిధి మారన్ అన్నారు. ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాగా ఆలోచించి ఓటు వేశానని చెప్పారు. తాను సరైందని నమ్మిన దానికే మద్దతు ఇచ్చానని అన్నారు. తమిళనాడు ప్రజలు చాలా విద్యావంతులని, వారు కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని నమ్ముతున్నట్టు తెలిపారు.
చదవండి: ఫస్ట్ టైమ్.. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిన విజయ్
ఓటు వేసిన సినీ సెలబ్రిటీలు
తమిళ అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్‌హాసన్, అజిత్, విజయ్, సూర్య, కార్తి, శరత్ కుమార్, శశికుమార్, విక్రమ్, శివకార్తికేయ, ధనుష్, విజయ్ సేతుపతి, ప్రదీప్ రంగనాథన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కథానాయికలు రాధిక, కుష్బూ, గౌతమి, స్నేహ, త్రిష, జ్యోతిక, శృతి హాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఓటు వేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, దర్శకులు ప్రభుదేవా, ఆట్లీ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో నటులు సత్యరాజ్, సిద్ధార్థ్, యోగిబాబు, సూరి తదితరులు ఓటు వేసిన వారిలో ఉన్నారు.


