రూ.6 కోట్లు ఉంటే.. అంతరిక్షంలోకి! నెరవేరనున్న భారతీయుల కల

ISRO design for space tourism - Sakshi

స్పేస్‌ టూరిజానికి ఇస్రో రూపకల్పన

2030 నాటికి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందంటున్న ఇస్రో చైర్మన్‌

టికెట్‌ ధర రూ.6 కోట్లు ఉండే అవకాశం

అంతరిక్షంలో పర్యటించాలనుకునే భారతీయుల కల నెరవేరనుంది. ఈ కల సాకారానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నాలు ప్రారంభించింది. 2030 నాటికి స్పేస్‌ టూరిజం ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని.. దీనికి సంబంధించిన పని జరుగుతోందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ఇటీవల ప్రకటించారు. ఇందుకోసం సొంతంగాఒక మాడ్యూల్‌ తయారు చేస్తున్నట్టు తెలిపారు.టికెట్‌ ధర రూ.6 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

సబ్‌ ఆర్బిటలా.. ఆర్బిటలా...
అంతరిక్ష పర్యటన ఆర్బిటల్‌గా ఉంటుందా లేక సబ్‌ ఆర్బిటల్‌గా ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. టికెట్‌ ధర రూ.6 కోట్లు అంటున్నారు కాబట్టి.. ఇది సబ్‌ ఆర్బిటల్‌ పర్యటనే అయి ఉండవచ్చని భావిస్తున్నారు. స్పేస్‌ క్రాఫ్ట్‌ ప్రయాణించే వేగాన్ని బట్టి ఆర్బిటల్‌ పర్యటనా.. సబ్‌ ఆర్బిటల్‌ పర్యటనా అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

ఆర్బిటల్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌.. ఆర్బిటల్‌ వెలాసిటీ (కక్ష్య వేగం)తో ప్రయాణిస్తుంది. సబ్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ దాని కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. సబ్‌ ఆర్బిటల్‌ ట్రిప్‌ అయితే స్పేస్‌ క్రాఫ్ట్‌లో తిరిగి భూమ్మీదకు వచ్చేప్పుడు అంతరిక్షం అంచుల్లో కొద్ది నిమిషాలు తక్కువ గ్రావిటీ వాతావరణంలో (గాల్లో తేలియాడేలా) ఉన్న అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్లూ ఆరిజిన్‌ కంపెనీ సబ్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ టూర్‌ను విజయవంతంగా నిర్వహించింది.

2021లో బ్లూ ఆరిజిన్‌ అధినేత (అమెజాన్‌ వ్యవస్థాపకుడు) జెఫ్‌ బెజోస్‌ మరో ముగ్గురితో కలిసి అంతరిక్షంలో పర్యటించి వచ్చారు. సబ్‌ ఆర్బిటల్‌ రాకెట్లు ఆర్థికంగా అందుబాటులో ఉండటంతోపాటు వాటిని రెండోసారి కూడా వినియోగించే అవకాశం
ఉంటుంది.

పర్యాటక మాడ్యూల్‌ కోసం ప్రయత్నాలు
సబ్‌ ఆర్బిటల్‌ స్పేస్‌ టూరిజం మిషన్‌ సాధ్యాసాధ్యాలపై ఇస్రో అధ్యయనం చేస్తోందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆటామిక్‌ ఎనర్జీ అండ్‌ స్పేస్‌ మంత్రి జితేంద్రప్రసాద్‌ రాజ్యసభలో ఇటీవల వెల్లడించారు.

అంతరిక్ష పర్యాటక మాడ్యూల్‌ను తయారు చేసేందుకు నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఐఎన్‌–స్పేస్‌) ద్వారా ఇస్రో ప్రైవేట్‌ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఆ ఘనత టిటోదే
అంతరిక్ష పర్యాటకం చాలాకాలం క్రితమే మొదలైంది. ఆర్బిటల్‌ స్పేస్‌ టూరిజాన్ని రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ గతంలోనే ప్రారంభించింది. 2001లో అమెరికన్‌ మిలియనీర్‌ డెన్నిస్‌ టిటో రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీకి రూ.165 కోట్లు చెల్లించి స్పేస్‌ టూరిస్ట్‌గా అంతరిక్షంలో 8 రోజులు గడిపి తిరిగి వచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్‌ టూరిస్ట్‌ ఆయనే.

కానీ.. 2010లో రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ స్పేస్‌ టూరిజం కార్యకలాపాలను నిలిపివేయడంతో అంతరిక్ష పర్యాటకం అక్కడితోనే ఆగిపోయింది. 

అంతరిక్ష పర్యాటకానికి ఎంతో క్రేజ్‌
అంతరిక్ష పర్యాటకానికి ఎంతో క్రేజ్‌ ఉంది. అందుకే అంతర్జాతీయంగా వర్జిన్‌ గెలాక్టిక్, స్పేస్‌ ఎక్స్, బ్లూ ఆరిజిన్, ఆరిజిన్‌ స్పాన్, బోయింగ్, స్పేస్‌ అడ్వెంచర్స్, జీరో టు ఇన్‌ఫినిటీ వంటి ప్రైవేట్‌ స్పేస్‌ టూరిజం కంపెనీలు వాణిజ్యపరంగా స్పేస్‌ ఫ్లైట్స్‌ను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ నిలిపివేసిన స్పేస్‌ టూ రిజం కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్ని స్తున్నాయి.

ఆ ప్రయత్నంలో జెఫ్‌ బెజోస్‌ విజయం సాధించారు కూడా. వర్జిన్‌ గెలాక్టిక్‌ తన స్పేస్‌ ఫ్లైట్‌ వీఎస్‌ఎస్‌ యూనిటీని 2018లో పరీక్షించడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ కంపెనీ స్పేస్‌ టూరిస్టులు వెయిటింగ్‌ లిస్ట్‌ చాలా ఉంది. వాళ్లంతా డిపాజిట్లు  కట్టి పర్యటన కోసం ఎదురుచూస్తున్నారు. రాబోయే కాలంలో వాటి సరసన మన ఇస్రో స్పేస్‌ రాకెట్లు కూడా ఉండే అవకాశం ఉంది. 

- సాక్షి, అమరావతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top