రాజకీయ ఆయుధంగా డీలిమిటేషన్‌ | Govt Wants To Bulldoze Delimitation In Name Of Womens Reservation: Congress in Lok Sabha | Sakshi
Sakshi News home page

రాజకీయ ఆయుధంగా డీలిమిటేషన్‌

Apr 17 2026 5:09 AM | Updated on Apr 17 2026 5:13 AM

Govt Wants To Bulldoze Delimitation In Name Of Womens Reservation: Congress in Lok Sabha

మహిళా రిజర్వేషన్ల అమలు సాకు మాత్రమే: కాంగ్రెస్‌ 

మోదీ సర్కారు తీరు నిజంగా సిగ్గుచేటు: గౌరవ్‌ గొగొయ్‌ 

లోక్‌సభ స్థానాల పెంపు యోచనకు ప్రాతిపదిక ఏమిటి? 

ఆరెస్సెస్‌ ఆదేశాలనే అమలు చేస్తున్నారా అంటూ ధ్వజం 

మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ వ్యతిరేకి కాదని స్పష్టికరణ 

డీలిమిటేషన్‌ లేకుండా వాటి తక్షణ అమలుకు డిమాండ్‌

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల సాకుతో లోక్‌సభ స్థానాల పెంపునకు బలవంతంగా ఆమోదముద్ర వేయించుకునేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ దుయ్యబట్టింది. బీజేపీకి బాగా అలవాటైన బుల్డోజర్‌ పద్ధతినే ఈ విషయంలోనూ పాటిస్తోందంటూ లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష ఉప నేత గౌరవ్‌ గొగొయ్‌ తూర్పారబట్టారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని సవరించేందుకు గురువారం లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై చర్చను ఆయన ప్రారంభించారు. అవి మహిళా వ్యతిరేక బిల్లులంటూ మండిపడ్డారు. కులగణనకు, రాజ్యాంగానికే గాక దేశ సమాఖ్య నిర్మాణానికి కూడా ఆ బిల్లులు వ్యతిరేకమని ఆరోపించారు.

ఆ బిల్లుల ద్వారా డీలిమిటేషన్‌కు దొడ్డిదారిన ఆమోదం పొందడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం తప్ప మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం కానేకాదని కుండబద్దలు కొట్టారు. బీజేపీ కేవలం తన రాజకీయ బలాన్ని పెంచుకునేందుకే డీలిమిటేషన్‌ను రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందని గొగొయ్‌ ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్లపై ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధే ఉంటే లోక్‌సభ స్థానాలను పెంచకుండా ప్రస్తుత సంఖ్య 543తోనే ఆ చట్టాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. డీలిమిటేషన్‌ ద్వారా అనుచిత రాజకీయ లబ్ధి పొందడమే మోదీ సర్కారు ఏకైక ధ్యేయమని పునరుద్ఘాటించారు.

ఈ గెర్రీమాండరింగ్‌ (నియోజకవర్గాల సరిహద్దులను ఒక పార్టీకి లబ్ధి చేకూరేలా మార్చడం) ప్రయత్నాలకు స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. ‘‘అసలు లోక్‌సభ స్థానాల పెంపు ఆలోచన ఎక్కడినుంచి వచి్చంది? ఎన్ని స్థానాలను పెంచాలన్న అంశంపై మోదీ సర్కారు తనంత తానుగానే ఎలా నిర్ణయం తీసుకుంటోంది? ఏదైనా పార్లమెంటరీ నివేదిక ఆధారంగా ఇందుకు పూనుకున్నారా? లేదా నాగపూర్‌ (ఆరెస్సెస్‌) నిర్దేశాల మేరకా? లేదంటే ఇది కేవలం ఆకాశం నుంచి ఊడిపడ్డ ఆలోచనా?’’అంటూ ధ్వజమెత్తారు. 

దేశమంతటా ‘అస్సాం’ప్రయోగం 
రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్‌ను ఆయుధంగా మలచుకోవడం బీజేపీకి అలవాటేనని గౌరవ్‌ గొగొయ్‌ ఆరోపించారు. ‘‘గతంలోనూ ఆ పార్టీ ఎన్నోసార్లు ఇందుకు పాల్పడింది. జమ్మూకశ్మీర్, అస్సాంల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను ఇష్టానుసారంగా మార్చేసి అనుచిత లబ్ధి పొందింది. దాంతో ఇప్పుడదే ప్రయోగాన్ని దేశమంతటా చేసేందుకు మోదీ సర్కారు నిశ్చయించుకుంది.

అందుకు మహిళా రిజర్వేషన్లను సాకుగా వాడుకుంటోంది’’అని ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు నిజంగా సిగ్గుచేటంటూ దుయ్యబట్టారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయాలని మోదీ సర్కా రు భావిస్తే అందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ దానికి డీలిమిటేషన్‌తో ముడిపెట్టడానికి వీల్లేదు. లోక్‌సభ స్థానాలను పెంచే ప్రయత్నానికి స్వస్తి చెప్పి ప్రస్తుతమున్న 543 స్థానాలకే తక్షణం అమలయ్యేలా మహిళా రిజర్వేషన్లను వర్తింపజేయాలి’’అని గొగొయ్‌ డిమాండ్‌ చేశారు.

కులగణనకు బీజేపీ వ్యతిరేకి
రాజ్యాంగాన్ని మోదీ సర్కారు క్రమేపీ అన్నివిధాలా బలహీనపరుస్తూ వస్తోందని గౌరవ్‌ గొగొయ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘కులగణన పట్ల కేంద్రం సానుకూలంగా లేదన్న అనుమానాలు కూడా నానాటికీ బలపడుతున్నాయి. మోదీ సర్కారు అందుకు తొలినుంచీ వ్యతిరేకే. కేవలం మా నేత రాహుల్‌గాంధీ ఒత్తిడి కారణంగానే కులగణనకు అయిష్టంగా అంగీకరించింది’’అని ఆయన చెప్పుకొచ్చారు.

తాజాగా మూడు బిల్లులను ప్రవేశపెడుతూ లోక్‌సభలో కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ ప్రసంగించిన తీరును గొగొయ్‌ ఎద్దేవా చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఇప్పుడే తొలిసారిగా తాము ప్రవేశపెడుతున్నాం అన్నట్టుగా మంత్రి మాట్లాడారు. కానీ 2023లోనే ఆ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఆ సందర్భంగా కూడా సభలో వాళ్లు సరిగ్గా ఇవే వాదనలు చేశారు. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మాట్లాడిన మాటలనే ఇప్పుడు మేఘ్వాల్‌ మళ్లీ యథాతథంగా అప్పజెప్పారంతే!’’ అని తూర్పారబట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement