బెంగళూరు: ఎప్పుడు ఏమి జరగాలో అది జరుగుతోంది, ఇకపై రాజకీయాల గురించి మీడియాతో మాట్లాడను, సమయం వచ్చినపుడు అదే తెలుస్తుంది అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆదివారం బెంగళూరులో సదాశివనగరలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘మాలో ఎలాంటి సమస్య లేదు. ఏ రాజకీయం కూడా లేదు. ఏమేమి తీర్మానం అయ్యాయో అవి అమల్లోకి వస్తాయి. ఎప్పుడు ఏమి చేయాలో దానిని పార్టీ చేస్తుంది. పార్టీపై విశ్వాసముంది’ అని అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో చెరి సగం కాలం ఉండాలని సిద్దరామయ్య, తన మధ్య ఒప్పందం కుదిరిందని, దానిని అమలు చేయాలని డీకే డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. డీకే మాటలను బట్టి సీఎం కురీ్చని మార్చడానికి హైకమాండ్ సిద్ధమైనట్లు సమాచారం.
హైకమాండ్ మాట పాటిస్తాం
ముఖ్యమంత్రి కుర్చీ మార్పుపై స్పందించిన ఆయన, మీకు ఈ విషయంలో గందరగోళంగా ఉండవచ్చు. హైకమాండ్ చెప్పినదానిని పాటిస్తామని నేను, సీఎం చెప్పాం. అదే ప్రకారంగా నడచుకొంటామని తెలిపారు. మే 15న తన పుట్టిన రోజుకు ఎవరూ కూడా ఫ్లెక్స్, బ్యానర్‌లను వేయరాదని కోరారు. రోడ్ల సౌందర్యాన్ని నాశనం చేయరాదని, అలాంటివారిపై జరిమానా విధించాలని కమిషనర్‌కు సూచించానని తెలిపారు.
అంతర్గత రిజర్వేషన్లకు పరిష్కారం
ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లను తాము చెప్పినట్లు చేశామని బీజేపీ విమర్శల గురించి డీకే పేర్కొన్నారు. మాల, మాదిగ సముదాయాల్లో ముందు ఎవరికి, ఆ తరువాత ఎవరికి అనే ప్రశ్న గతంలో ఉండేది. దానిని పరిష్కారానికి దారిని కనిపెట్టామన్నారు. మాదిగ, మాల, లంబాణి, భోవి వర్గాలందరికీ న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. 30, 40 ఏళ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించామని చెప్పారు.


