ఫ్రంట్‌లైన్‌ వారియర్‌

Assam cop-cum-doctor runs Covid care - Sakshi

డాక్టర్‌ రాబిన్‌  @ ఐపీఎస్‌

కోవిడ్‌ సెంటర్‌ను నెలకొల్పిన ఎస్పీ

స్వయంగా వైద్యసేవలు

గువాహటి: కోవిడ్‌–19పై సమరంలో ముందుండి పోరాడుతోంది... డాక్టర్లు, పోలీసులు. కానీ ఒక్కరే ఈ రెండు పాత్రలను పోషిస్తే. అస్సాంలో ఓ యువ ఐïపీఎస్‌ ఆఫీసర్‌ ద్విపాత్రాభినయంతో ఇప్పుడు అందరి మన్ననలు అందుకొంటున్నారు. బార్‌పేట్‌ జిల్లా ఎస్పీ రాబిన్‌ కుమార్‌ విద్యార్హత ఎంబీబీఎస్, ఎండి. ప్రజలు కరోనాతో బాధపడుతుండటం, వైద్యపరంగా అత్యవసర పరిస్థితి నెలకొనడంతో... రాబిన్‌లోని వైద్యుడు మేల్కొన్నాడు.

పోలీసు సిబ్బందికి, వారి కుటుంబాలకు ఈ కష్టకాలంలో వైద్యసేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. అస్సాం డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహంత అనుమతితో... బార్‌పేట పోలీసు రిజర్వులో 50 పడకల కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను డాక్టర్‌ రాబిన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో 4 ఐసీయూ పడకలు, 32 జనరల్‌ బెడ్లు, 14 ఇతర బెడ్లు (ఆఫ్టర్‌ కేర్‌) ఉన్నాయి. ఒకవైపు ఎస్పీగా విధులు నిర్వర్తిస్తూనే... రాబిన్‌ కుమార్‌ ఈ సెంటర్‌లో డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు.

ఇప్పటివరకు బార్‌పేటలో 76 మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకగా... వారందరూ డాక్టర్‌ ఎస్పీ సాబ్‌ పర్యవేక్షణలో కోలుకున్నారు. తిరిగి విధులకు హాజరవుతున్నారు. పోలీసు కుటుంబాల్లోని 50 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యే వైద్య శిబిరం నిర్వహించారు. సాధారణ ప్రజలకు కూడా సేవలందించే ఉద్దేశంతో వృద్ధులు, మహిళలకు వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. బీపీ, మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలున్న పోలీసులకు స్టేషన్లలోనే కూర్చుండే విధులు అప్పగించి... వారు కరోనా బారినపడకుండా చూసుకుంటున్నారాయన.

లాక్‌డౌన్‌ కాలంలో పేదలకు ఆహారం అందించడానికి బార్‌పేట్‌ పోలీసులు 40 రోజుల పాటు కమ్యూనిటీ కిచెన్‌ను కూడా నడిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన రాబిన్‌ కుమార్‌ 2013 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 10, 12 తరగతుల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన ఆయన ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినా వద్దనుకొని ఎంబీబీఎస్‌ను ఎంచుకున్నారు. మీరట్‌లోని లాలా లజ్‌పత్‌ రాయ్‌ మెమోరియల్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశారు. ‘జిల్లా పోలీసు అధికారిగా, డాక్టర్‌గా రెండు పాత్రల్లో సేవ చేసే అవకాశం కలగడం నా అదృష్టం. ఇది నాకెంతో సంతృప్తిని ఇస్తోంది’అని రాబిన్‌ తెలిపారు.

ప్రశంసల జల్లు
‘ఓ అస్సాం పోలీసు వారియర్‌ ఈ పదానికి నిజమైన అర్థం చెబుతున్నారు. మానవసేవకు గొప్ప భాష్యం చెబుతున్నారు ఎస్పీ డాక్టర్‌ రాబిన్‌ కుమార్‌. వైద్యరంగంలో తనకున్న నైపుణ్యంతో కోవిడ్‌పై పోరులో డాక్టర్లకు, వైద్యసిబ్బందికి సాయపడుతున్నారు’అని అస్సాం సీఎం సర్బానంద సొనోవాల్‌ ప్రశంసించారు. ‘డాక్టర్‌ రాబిన్‌ కుమార్, ఎస్పీ బార్‌పేట్‌ కరోనాపై  సాగిస్తున్న సమరంలో ముందుండి పోరాడుతున్నారు’అని భారత ఐపీఎస్‌ అసోసియేషన్‌ ట్వీట్‌ చేసింది. రాబిన్‌ పోలీసు యూనిఫాంలో స్టెతస్కోప్‌ పట్టుకొని వైద్యం చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. తోటి ఐపీఎస్‌లతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top