8 రోజులుగా ఎయిమ్స్‌ సర్వర్‌ డౌన్‌.. ఇద్దరిపై వేటు

AIIMS Server Remains Down For Eighth Day Two Suspended - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) సర్వర్‌ హ్యాకైంది. గత ఎనిమిది రోజులుగా పని చేయడం లేదు. సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియా కంప్యూటర్స్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తోంది. ఎనిమిది రోజులు గడిచినా పరిస్థితి అలాగే కొనసాగుతుండటంతో.. ఢిల్లీకి చెందిన ఇద్దరు విశ్లేకులను సస్పెండ్‌ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనల కింద మరికొంత మందిపై వేటు పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 

‘సర్వర్‌ హ్యాక్‌ అయిన క్రమంలో శానిటైజింగ్‌ ప్రక్రియ మొదలైంది. మొత్తం 50 సర్వర్లలో ఇంతకు ముందు 15 మాత్రమే శానిటైజింగ్‌ చేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 25కు పెంచారు. అలాగే 400లకుపైగా ఎండ్‌పాయింట్‌ కంప్యూటర్లను స్కాన్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సైతం అప్‌లోడ్‌ చేస్తున్నారు.’ అని అధికారవర్గాలు తెలిపాయి.

మరోవైపు.. సర్వర్‌ డౌన్‌ సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎయిమ్స్‌ మంగళవారం ఓ ప్రకటన చేసింది. సర్వర్లలో ఈ-హాస్పిటల్‌ డేటా పునరుద్ధరణ చేసినట్లు పేర్కొంది. సేవలను పునరుద్ధరించే ముందు నెట్‌వర్క్‌ శానిటైజింగ్‌ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు, సర్వర్లు, డేటా ఉండటం వల్ల ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని వెల్లడించింది. సైబర్‌ సెక్యూరిటీ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఔట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌, ల్యాబ్‌లు వంటి అన్ని సేవలు మాన్యువల్‌గా కొనసాగుతాయని స్పష్టం చేసింది. 

ఎయిమ్స్ సర్వర్‌ హ్యాకింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), ది ఇండియా కంప్యూటర్స్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్, ఢిల్లీ పోలీసు, ఇంటలిజెన్స్‌ బ్యూరో, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), కేంద్ర హోంశాఖలు దర్యాప్తు చేపట్టాయి. దర్యాప్తు సంస్థల సూచలన మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు.

ఇదీ చదవండి: షాకింగ్‌:హైస్కూల్‌ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్స్‌, గర్భనిరోధకాలు..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top