వరి సాగు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

వరి సాగు తగ్గించాలి

Jun 12 2026 6:21 AM | Updated on Jun 12 2026 6:21 AM

నారాయణపేట రూరల్‌: మండలంలోని సింగారం గ్రామంలో గురువారం జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ పర్యటించారు. ఈ సందర్భంగా రైజోబియంతో కంది విత్తనశుద్ధి అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పంటమార్పిడీ చేపట్టాలని, ముఖ్యంగా అపరాలు, నూనెగింజల సాగు చేయాలని, భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు నాటుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పీఎం ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకంలో భాగంగా రాయితీపై కంది విత్తనాలు అందిస్తున్నామని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోరుబావుల కింద వరి సాగు తగ్గించుకొని తక్కువ నీరు అవసరం ఉన్న పంటలైన నూనెగింజలు, పప్పు జాతిరకాలు, చిరుధాన్యాలు సాగు చేయాలన్నారు. అనంతరం రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఏఓ దినకర్‌, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజేష్‌, అనిల్‌కుమార్‌, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

కోస్గి రూరల్‌: ప్రభుత్వం మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని హౌసింగ్‌ పీడీ శంకర్‌నాయక్‌ కోరారు. గురువారం మండలంలోని తోగాపూర్‌, సర్జఖాన్‌పేట, ముశ్రీఫా, ముంగిమళ్లతో పాటు పట్టణంలోని పలు వార్డులు, గుండుమాల్‌ మండలంలోని అమ్లికుంట, పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికై న ముదిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరెడ్డిపల్లికి 100 ఇళ్లు మంజూరు కాగా 61 వివిధ దశల్లో ఉండగా, 27 ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. 35 ఇళ్ల నిర్మాణాలు బెస్‌మెంట్‌ దశ వరకు కూడా రాలేదని చెప్పారు. కోస్గి మున్సిపాలిటీకి 207 ఇళ్లు మంజూరు కాగా.. 145 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, కోస్గి మండలానికి 439 ఇళ్లు మంజూరు.. 296 నిర్మాణాలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రభుత్వం నిధులు సైతం వేగంగా మంజూరు చేస్తోందని నిర్మాణాల్లో వేగం పెంచాలని కోరారు. హౌసింగ్‌ ఏఈ శివకుమార్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement