నారాయణపేట: భూముల మార్కెట్ విలువల పెంపు ప్రభుత్వ ఆదాయానికి ఊతమిస్తుండగా.. సామాన్య ప్రజలపై మాత్రం అదనపు ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడంతో రియాల్టర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. వారం కిందటే నారాయణపేట, మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార యంత్రాంగం మార్కెట్ విలువల ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. వ్యవసాయ భూములకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువకు 50 శాతం.. వ్యవసాయేతర భూములకు 30 నుంచి 40 శాతం, ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు సమాచారం.
జూన్ 5 నుంచి కొత్త ధరలు అమలులోకి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచే కొత్త మార్కెట్ విలువలు అమలులోకి వచ్చాయి. జిల్లాలోని నారాయణపేట, మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 13 మండలాలు, నాలుగు పురపాలికలు ఉన్నాయి. నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో నారాయణపేట, కోస్గి మున్సిపాలిటీలు, దామరగిద్ద, మద్దూర్, ధన్వాడ, మరికల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట, కోస్గి మండలాలు, మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో మక్తల్ మున్సిపాలిటీ, మండలం,
మాగనూర్, కృష్ణా మండలాలు ఉన్నాయి.
పురపాలికల్లో..
నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో గజానికి కనిష్టంగా రూ.6,200 నుంచి గరిష్టంగా రూ.11, 700 వేలు పెరిగింది. మద్దూర్ మున్సిపాలిటీలో కనిష్టంగా రూ.1,400, గరిష్టంగా రూ.1,800.. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని గార్లపల్లిలో రూ. 900, తిర్మలాపూర్ రోడ్‌లో కనిష్టంగా రూ.1,100 నుంచి గరిష్టంగా రూ.7,900 వరకు పెరిగింది. కోస్గి మున్సిపాలిటీలో కనిష్టంగా రూ.3,200, గరిష్టంగా రూ.10,200 పెంచారు.
ప్రజలకు అదనపు భారం..
మార్కెట్ విలువల పెంపుతో ప్రతి రిజిస్ట్రేషనన్‌పై ప్రభుత్వానికి అధిక ఆదాయం లభించనుంది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణ వ్యయాలు, సిమెంట్, ఇనుము, కార్మిక ఖర్చులు పెరిగిన నేపథ్యంలో భూ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెరగడం సామాన్య కుటుంబాలపై అదనపు భారంగా మారింది.
రియల్ రంగంలో సందిగ్ధం..
కొత్త మార్కెట్ ధరలు అమలులోకి వచ్చిన వెంటనే రియల్ ఎస్టేట్ రంగంలో కొంత మందగమనం కనిపిస్తోంది. భూములు కొనాలనుకున్న వారు కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబిస్తుండగా, విక్రేతలు మాత్రం మరింత ధర వస్తుందనే ఆశతో అమ్మకాలను నిలిపివేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్రయ విక్రయాలు తగ్గుముఖం పట్టినట్లు రియల్ వ్యాపారులు చెబుతున్నాయి.
పేటలో ఎకరం గరిష్టంగా రూ.2.20 కోట్లు
గజానికి రూ.11,700 పెరుగుదల.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం
కనిష్టంగా రూ.900..
అమలులోకి వచ్చిన పెంచిన
మార్కెట్ విలువలు
కొనుగోలుదారులపై అదనపు భారం


