నారాయణపేట: కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు వేగంగా, ఖర్చు లేకుండా పరిష్కరించడంలో జాతీయ లోక్ అదాలత్ కీలక వేదికగా నిలుస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడంపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వాస్తవానికి మే నెల 9న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ వివిధ కారణాలతో వాయిదా పడిందన్నారు. జిల్లాలోని 14 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి రాజీమార్గంలో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్లతో పాటు ఎకై ్సజ్‌శాఖ పరిధిలో ఉన్న కేసులను కూడా లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ–పెట్టి, డ్రంకెన్ డ్రైవ్, చిన్న చిన్న వివాదాలు, ఎకై ్సజ్‌శాఖ తదితర మొత్తం 6,500 కేసుల పరిష్కారమే లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జైళ్లలో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీల కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. చార్జిషీట్లు, సైబర్ క్రైం కేసుల పురోగతి, విచారణలో ఉన్న అంశాలపై కూడా చర్చించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.మనోజ్‌కుమార్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో కక్షిదారులు తక్కువ సమయంలో ఎలాంటి అదనపు వ్యయభారం లేకుండా కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించి రాజీమార్గంలో కేసుల పరిష్కారానికి యత్నించాలని సూచించారు. సమావేశంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్, డిఫెనన్స్ కౌన్సిల్ కె. లక్ష్మీపతిగౌడ్, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది,
కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


