ప్రజావాణికి 26 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 26 అర్జీలు

Jun 9 2026 9:16 AM | Updated on Jun 9 2026 9:16 AM

నారాయణపేట: ప్రజావాణికి వచ్చిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనుకు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతి వెనుక ఒక కుటుంబం ఆశ, బాధ, అవసరం దాగి ఉంటుందని పేర్కొంటూ పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా పని చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణి అనేది ప్రజలు ప్రభుత్వాన్ని నేరుగా ఆశ్రయించే వేధికని.. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకొని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారుల స్పందనే ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని పేర్కొన్న కలెక్టర్‌ ప్రజా సమస్యల పరిష్కారంలో మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. మొత్తం 26 అర్జీలు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.

వరి క్వింటా రూ.2,769

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం వరి (సోనారకం) క్వింటా గరిష్టంగా రూ.2,769, కనిష్టంగా రూ.2,302 ధరలు పలికాయి. వరి (హంస రకం) సరాసరి ధర రూ.1,712 లభించింది.

వేరుశనగ క్వింటా రూ.7,740

గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సోమవారం 289 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,740, కనిష్టంగా రూ. 4,469, సరాసరి రూ. 6,240 ధరలు లభించాయి. 14 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,200, కనిష్టంగా రూ. 2,300, సరాసరి రూ. 6,179 ధర పలికింది. 58 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,516, కనిష్టంగా రూ. 1,850, సరాసరి రూ. 1,889 ధరలు వచ్చాయి.

11 నుంచి పీడీఎస్‌యూ శిక్షణ తరగతులు

ఊట్కూర్‌: పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అజయ్‌ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని బిజ్వార్‌ గ్రామంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయని.. విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేయడం, రాజకీయ, సామాజిక పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన పెంపొందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మహేష్‌, నాయకులు రమేష్‌, ఆకాష్‌, కార్తీక్‌ పాల్గొన్నారు.

మాజీ సైనికుల సంక్షేమానికి కృషి

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): మాజీ సైనికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సైనిక సంక్షేమ డైరెక్టర్‌, బ్రిగేడియర్‌ ఎన్‌ఆర్‌ బాబు అన్నారు. సోమవారం స్థానిక సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో మాజీ సైనికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చించి మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రిజర్వేషన్‌ను 2 నుంచి 5 ఏళ్లు పెంచాలని మాజీ సైనికులు అడుగుతున్నారని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం మాజీ సైనికుల సంఘం నాయకులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సైనిక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి నాగేశ్వర్‌, ఎమ్మార్కే రెడ్డి, వెంకటయ్యగౌడ్‌, రాములు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement