నారాయణపేట: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతు ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ అమలు చేస్తోందని.. దేశవ్యాప్తంగా ఎంపికై న 100 జిల్లాల్లో చోటు దక్కించుకున్న నారాయణపేట సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేస్తోందని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ‘పీఎం ధన్‌ధాన్య కృషి యోజనశ్రీకు సంబంధించి వార్షిక ప్రణాళిక అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పథకాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పథక లక్ష్యాలను సాధించేందుకు ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలోని కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. వార్షిక ప్రణాళిక అమలులో సాంప్రదాయ విధానాలకు మాత్రమే పరిమితం కాకుండా వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానిక అవసరాలు, రైతుల పరిస్థితులు, సహజ వనరులను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ రూపొందించాలన్నారు. పథకం నోడల్ అధికారి సాయిబాబా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంపికై న నాలుగు జిల్లాల్లో ఉమ్మడి పాలమూరులోని నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండటం విశేషమన్నారు. పీఎం డీడీకేవై అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర సహకార మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర నోడల్ అధికారి రమణ్‌కుమార్ జనవరి 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించి పథకం అమలుపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, సహకార, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. రైతు ఆదాయం పెంపు, ప్రకృతి వ్యవసాయం, నీటి వనరుల సమర్థ వినియోగం, గ్రామీణ ఉపాధి అవకాశాల విస్తరణకు పథకం దోహదపడనుందని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకట్రాములు, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, డీపీఓ సుధాకర్‌రెడ్డి, ఎల్‌డీఎం విజయ్‌కుమార్, నాబార్డ్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


