నారాయణపేట: జిల్లాలో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని డీసీఆర్బీ డీఎస్పీ మహేష్, డీఎస్పీ నల్లపు లింగయ్య ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెనన్స్ హాల్‌లో నిర్వహించిన నేర సమీక్షకు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీలు పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని సర్కిళ్లు, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను ప్రాధాన్యతతో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి కేసులో నాణ్యమైన విచారణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, నేరస్తులకు శిక్ష పడేలా పటిష్ట సాక్ష్యాధారాలు సేకరించాలని సూచించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలంటే బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేసుల విచారణలో జాప్యం, నిర్లక్ష్యం సహించబోమని.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేయాలని, బ్లూ కోల్ట్స్ సిబ్బంది నిరంతరం రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భద్రతాభావం పెంపొందించాలని తెలిపారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణా, మట్కా, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల గుర్తింపు, విచారణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటును వేగవంతం చేయాలని, ఉన్న కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని కోరారు. కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని, సామాజిక సమస్యలు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామస్థాయిలో సమాచారం సేకరించి ముందస్తుగా నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐలు భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సతీష్‌రెడ్డి, ఎస్‌ఎం నవీద్, రాజు, అశోక్‌బాబు, బాలరాజు, రమేష్, రాము, రాజశేఖర్, పురుషోత్తం, నరేష్, సునీత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


