కలెక్టరేట్‌ పనులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ పనులు వేగవంతం

Jun 7 2026 9:36 AM | Updated on Jun 7 2026 9:36 AM

నెలాఖరులోగా

నిర్మాణం పూర్తిచేయడమే లక్ష్యం

కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

నారాయణపేట: జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం మలుపు వద్ద రూ. 55కోట్లతో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణాన్ని ఆమె పరిశీలించి.. పనుల పురోగతిని ఆర్‌అండ్‌బీ అధికారులతో తెలుసుకున్నారు. భవన నిర్మాణంతో పాటు అన్ని మౌలిక సదుపాయాల పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. భవన అంతర్గత ఎలక్ట్రికల్‌ వ్యవస్థ పూర్తిస్థాయి ప్రమాణాలతో ఉండాలని.. ప్లంబింగ్‌ పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్మాణ సంస్థలు నిర్దేశిత కాలపరిమితిలో పని పూర్తిచేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ఆధునికత ప్రతిబింభించాలని, జిల్లా అధికారుల చాంబర్లలో గ్లాస్‌ మాడిఫికేషన్‌ పనులు నాణ్యతగా ఉండాలన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో సీసీరోడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని.. వర్షాలు ప్రారంభమైతే రోడ్ల పనులు ఆలస్యమవుతాయని తెలిపారు. ఆవరణలో ప్లాంటేషన్‌, బ్యూటిఫికేషన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ అభివృద్ధి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో పనులు జరగాలని ఆమె తెలిపారు. నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం ఉండదన్నారు. అన్ని పనులను సమన్వయంతో ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఆమె వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ, ఏఈలు ఉన్నారు.

● జిల్లా కేంద్రంలో నిరుపయోగంగా మారిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ సముదాయాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. మార్కెట్‌లో ఓపెన్‌ షెడ్ల నిర్మాణం, స్థల వినియోగం, దుకాణాల కేటాయింపు స్థితి వంటి అంశాలపై ఆరా తీశారు. సముదాయం ప్రారంభించిన తర్వాత ఎందుకు నిలకడగా నిర్వహణ జరగలేదన్న విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ శంకర్‌ను కలెక్టర్‌ ప్రశ్నించారు. దుకాణాల కేటాయింపు, వ్యాపారుల ఆసక్తి, మౌలిక వసతుల లోపాలు, నిర్వహణ సమస్యలు వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

● విద్యా సంవత్సరం పునఃప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మరమ్మతు పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో కేజీబీవీలు, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల ఎస్‌ఓలు, ఇంజినీరింగ్‌ అధికారులు, సంక్షేమశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 11 కేజీబీవీల్లో చిన్నచిన్న మరమ్మతు పనులన్నీ సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఇతర పనులను రెండు నెలల్లో పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఊట్కూర్‌ కేజీబీవీ ప్రహరీ నిర్మాణానికి సంబంధించిన వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించి.. పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఊట్కూర్‌ కేజీబీవీలో ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థినులు ఎక్కడెక్కడ చదువుతున్నారో వివరాలు సేకరించాలని ఎస్‌ఓకు సూచించారు. అనంతరం మద్దూరు, మాగనూరు, మక్తల్‌ కేజీబీవీల మరమ్మతు పనుల పురోగతిపై కలెక్టర్‌ సమీక్షించారు. సమావేశంలో జీసీడీఓ సంగీత, జిల్లా సంక్షేమశాఖ అధికారి అబ్దుల్‌ ఖలీల్‌, సెక్టోరియల్‌ అధికారి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement