కేతేపల్లి : జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శుక్రవారం ప్రాజెక్టుకు 876 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో కాల్వలకు విడుదల నిలిపి వేసే నాటిని రిజర్వాయర్‌లో నీటిమట్టం 627 అడుగులకు (గరిష్ట నీటిమట్టం 645 అడుగులు) తగ్గిపోయింది. నెల రోజుల నుంచి మూసీ ఎగువ, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీకి రోజూ 400 నుంచి 500 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 640 అడుగులకు చేరుకుంది. 4.46 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 3.17 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.


