హీరో రాజశేఖర్ తాజాగా బైకర్ మూవీతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇండియాలోనే తొలి స్పోర్ట్స్ మోటోక్రాస్ రేసింగ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ బైకర్ సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్‌కు రాజశేఖర్ సతీమణి జీవిత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మూవీ రివ్యూవర్లపై మాట్లాడారు. సినిమా ఎంత బాగా తీసినా కూడా విమర్శలు చేస్తూనే ఉంటారన్నారు. రివ్యూలు చదువుతుంటే.. సినిమా ఎలా తీయాలో రివ్యూయర్లనే అడుగుదామా అనిపిస్తోందని తెలిపారు. సినిమాలో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలోడ్రామా అని తీసి పారేస్తారు.. అదే స్టైలిష్‌గా తీస్తే డెప్త్ లేదని విమర్శిస్తారు. ఏది నమ్మాలో మాకు అర్థం కావడం లేదన్నారు. ఒక సినిమా వెనుక ఎంతో మంది కష్టం, కోట్లాది రూపాయల ఖర్చు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రేక్షకులు రివ్యూలు చూసి కాకుండా.. స్వయంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని జీవిత పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రేక్షకుడి రివ్యూనే మాకు ముఖ్యమని అన్నారు. ఏవైనా గొడవలున్నా, మనస్పర్థలున్నా మనసు విప్పి మాట్లాడుకోండి.. ఎవరినీ దూరం పెట్టకండి.. సంతోషంగా ఉండటమే జీవితం అంటూ ఆమె ప్రేక్షకులకు సందేశమిచ్చారు జీవిత రాజశేఖర్. ఈ కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.


