స్పీడ్‌ పెంచారు | Telugu Heroes Plan to Release at Least One Movie Per Year: Tollywood | Sakshi
Sakshi News home page

స్పీడ్‌ పెంచారు

Apr 29 2026 2:19 AM | Updated on Apr 29 2026 2:19 AM

Telugu Heroes Plan to Release at Least One Movie Per Year: Tollywood

ఏడాదికో సినిమా అయినా రిలీజ్‌ చేయాలనే ప్లాన్‌లో తెలుగు హీరోలు

పాన్‌ ఇండియా ట్రెండ్‌లో పడి కొందరు తెలుగు హీరోలు పర్‌ఫెక్షన్‌ కోసం ఒకే సినిమాతో సెట్స్‌లో రెండు మూడేళ్లు గడుపుతు న్నారు. కథ స్థాయి, నిర్మాణ విలువల ప్రాధాన్యం వల్ల  ఈ సమయం కొన్నిసార్లు పెరుగుతుంది. అయితే ఇకపై సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్‌ ఉండకూడదని, ప్రేక్షకులకు మరింత చేరువలో ఉండాలని ఏడాదికో సినిమాను రిలీజ్‌ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు కొందరు హీరోలు. స్పీడ్‌ పెంచి, వరుస సినిమాలు సైన్‌ చేస్తున్నారు. మరి... ఈ హీరోలు, వీరు చేస్తున్న సినిమాల గురించి ఓ లుక్‌ వేద్దాం.

స్ట్రాంగ్‌ లైనప్‌ 
స్టార్‌ హీరో ప్రభాస్‌ లైనప్‌ ఎప్పుడూ మూడు సినిమాలకు తక్కువ కాకుండా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఫౌజి, స్పిరిట్‌’ చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. వచ్చే నెల నుంచి ‘కల్కి 2’ సినిమా చిత్రీకరణను కూడా షురూ చేయనున్నారు. ఇలా ఏకకాలంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ సినిమా ‘ఫౌజి’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. 1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్‌ సైనికుడిపాత్రలో కనిపిస్తారని తెలిసింది ఇమాన్వీ ఇస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్, రాహుల్‌ రవీంద్రన్‌ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ గతంలో ప్రకటించారు. అయితే ‘ఫౌజి’ సినిమా విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్‌ ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోవైపు ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్‌’ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైపోయింది. వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు. దీంతో వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు సందీప్‌ రెడ్డి వంగా.

ఈ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి ఐపీఎస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తుండగా హీరోయిన్‌ త్రిప్తి దిమ్రి డాక్టర్‌ రోల్‌ చేస్తున్నారని తెలిసింది. వివేక్‌ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్, కాంచన, ప్రకాశ్‌ రాజ్‌ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టి సిరీస్‌ ఫిలింస్, భద్రకాళి పిక్చర్స్‌ పతాకంపై భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

త్వరలో కల్కి సెట్స్‌లో..! 
దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌’ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి సినిమా ‘కల్కి  2898ఏడీ’. ఈ యూనివర్స్‌ నుంచి వచ్చే ఏడాది ‘కర్ణ 3102బీసీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమా రానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్‌పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వచ్చే నెలలో ఈ చిత్ర హీరో ప్రభాస్‌ సైతం ఈ సినిమా సెట్స్‌లో జాయిన్‌ కానున్నట్లుగా తెలిసింది. సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘కర్ణ 3102బీసీ’ సినిమా వచ్చే ఏడాది చివర్లో థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇంకా ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌లో మూడు సినిమాల్లో హీరోగా నటించేందుకు ప్రభాస్‌ ఆల్రెడీ కమిటైన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి ‘సలార్‌ 2’ అని, మరో చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

ఒకే ఏడాదిలో మూడు సినిమాలు 
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్‌ ట్రాక్‌లోకి వచ్చారు శర్వానంద్‌. ఈ యంగ్‌ హీరో నుంచి ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పోర్ట్స్‌ డ్రామా ‘బైకర్‌’ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం  శర్వానంద్‌ ‘భోగి’, శ్రీను వైట్ల డైరెక్షన్‌లోని ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా చేస్తున్నారు. సంపత్‌ నంది దర్శకత్వంలోని ‘భోగి’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 28న రిలీజ్‌ కానుంది. 1960 కాలమానంలో తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతంలో జరిగే ఈ రివెంజ్‌ యాక్షన్‌ సినిమాలో అనుపమా పరమేశ్వర్, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా కేకే రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ‘జార్జ్‌ క్రిష్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నట్లుగా శర్వానంద్‌ ఆల్రెడీ ప్రకటించారు. ఒకవేళ ఈ సినిమా అనుకున్నట్లుగా వచ్చే సంక్రాంతికే రిలీజ్‌ అయితే 2026 సంక్రాంతి నుంచి 2027 సంక్రాంతికి లోపు నాలుగు సినిమాల్లో శర్వానంద్‌ కనిపించినట్లు అవుతుంది.

ఇటు గోదావరి... అటు రాయలసీమ 
‘రణబాలి, రౌడీ జనార్థన’... ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్‌తో విజయ్‌ దేవరకొండ బిజీగా ఉన్నారు. ఈ రెండూ పీరియాడికల్‌ సినిమాలే కావడం విశేషం. అలాగే ‘రణబాలి’ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరు 11న, ‘రౌడీ జనార్థన’ సినిమాను ఈ డిసెంబరులో రిలీజ్‌ చేయనున్నట్లు విజయ్‌ దేవరకొండ ఆల్రెడీ ప్రకటించారు. ఈ దిశగా షూటింగ్స్‌ జరుగుతున్నాయి. 1854 –1878 మధ్య బ్రిటిష్‌ పరి పాలనా కాలంలో, రాయలసీమలో జరిగిన ఆర్థిక దోపిడీ, రణబాలి తిరుగుబాటు వంటి అంశాల ఆధారంగా ‘రణబాలి’ సినిమా కథనం ఉంటుంది. విజయ్‌ దేవరకొండ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాలో ఆయన భార్య రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తున్నారు. జయమ్మపాత్రలో నటిస్తున్నారు రష్మిక.

‘గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల తర్వాత విజయ్‌–రష్మిక కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ‘రౌడీ జనార్థన’ విషయానికి వస్తే... రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇందులో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా చేస్తున్నారు. 1980 టైమ్‌లైన్‌లో తూర్పుగోదావరి నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇది. విజయ్‌ దేవరకొండ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం గోదావరి యాసలో మాట్లాడేందుకు విజయ్‌ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ రెండు చిత్రాలను కాస్త పక్కన పెడితే... విజయ్‌ దేవరకొండ హీరోగా శౌర్యువ్‌ దర్శకత్వంలో ఓ మైథలాజికల్‌ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. వైరా ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరి... ‘రణబాలి’, ‘రౌడీ జనార్థన’లతో కలిసి ఈ సినిమానూ విజయ్‌ సెట్స్‌కు తీసుకువెళ్తారా? లేక ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తర్వాత స్టార్ట్‌ చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాలి.

ముచ్చటగా మూడు 
వరుసగా సినిమాలు చేయడానికి పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్నారు నితిన్‌. ఈ ప్లాన్‌లో భాగంగా నితిన్‌ ఆల్రెడీ మూడు సినిమాలు కమిట్‌ అయ్యారు. ముందుగా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలోని సినిమాను షురూ చేస్తున్నారు నితిన్‌. సోము–నర్రి ద్వయం దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం వచ్చే నెల మొదటివారంలో జరుగుతుందని, చిత్రీకరణ కూడా వచ్చే నెలలోనే ప్రారంభం అవుతుందని తెలిసింది. రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తారని సమాచారం. ఇక వీఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో నితిన్‌ ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో తొలిసారి నితిన్‌ ద్వి పాత్రాభినయం చేయనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. అలాగే సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్‌ మూవీస్‌లో ఓ సినిమా చేయనున్నారు నితిన్‌. ‘ఆయ్‌’ సినిమా ఫేమ్‌ దర్శకుడు అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. సో... వీలైనంత తొందరగానే ఈ సినిమా చిత్రీకరణను స్టార్ట్‌ చేయాల్సి ఉంది. ఇలా నితిన్‌ ఏకకాలంలో కనీసం రెండు సినిమాలు చేస్తారని ఊహించవచ్చు. 

పాలిటిక్స్‌... ఫ్యాంటసీ! 
వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోల్లో సందీప్‌ కిషన్‌ ఒకరు. సందీప్‌ హీరోగా నటించిన ‘సిగ్మా’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ప్రజెంట్‌ కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో ‘పవర్‌ పేట’, ‘శంబాల’ ఫేమ్‌ యుగంధర్‌ ముని డైరెక్షన్‌లోని సోషియో ఫ్యాంటసీ సినిమాలకు సందీప్‌ కిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు ఈ మూవీని నిర్మిస్తారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు సమాంతరంగా జరగనున్నాయి. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాది రిలీజ్‌ అవుతాయి. అలాగే సందీప్‌ కిషన్‌ హీరోగా ‘వైబ్, మాయవన్‌’ వంటి సినిమాల ప్రకటనలు వచ్చాయి కానీ, ఆ తర్వాత ఈ సినిమాపై మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది.

రానా రెడీ! 
ఇటీవలి కాలంలో నిర్మాతగా ఫుల్‌ బిజీగా ఉన్నారు రానా. దుల్కర్‌ సల్మాన్‌తో ‘కాంత’ వంటి సినిమాను నిర్మించడమే కాకుండా, తన స్పిరిట్‌ మీడియా సంస్థ ద్వారా పలు తెలుగు సినిమాల రిలీజ్‌లకు అసోసియేట్‌ అయ్యారు. కాగా, రానా మళ్లీ యాక్టింగ్‌పై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. తేజ సజ్జా ‘మిరాయ్‌’ క్లైమాక్స్‌లో కనిపించారు రానా. సో... ‘మిరాయ్‌ 2’ చిత్రంలో రానా ఉంటారని ఊహించవచ్చు. ఇక అక్షయ్‌ కుమార్, రానా  లీడ్‌ రోల్స్‌లో చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రానుందనే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

కరణ్‌ జోహర్‌ నిర్మించనున్న ఈ హిస్టారికల్‌ సినిమా ఉజ్జయిని నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. అలాగే ‘జై హనుమాన్‌’ సినిమా చిత్రీకరణలోనూ రానాపాల్గొంటున్నారని తెలిసింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా ఓ ప్రధానపాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ఇలా ఏక కాలంలో రెండు    సినిమాలు చేస్తున్నారు రానా. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘జై హనుమాన్‌’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుందని తెలుస్తోంది. 
ఇలా ఒకేసారి రెండు మూడు సినిమాలను సెట్స్‌పైకి తీసుకువెళ్లిన హీరోలు మరికొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఈ తరహాలో సినిమాలు చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

ఏడాదికో సినిమా!
మహేశ్‌బాబు హీరోగా నటించి, థియేటర్స్‌లో రిలీజైన గత చిత్రం ‘గుంటూరు కారం’. 2024లో ఈ సినిమా విడుదలైంది. మహేశ్‌బాబు నెక్ట్స్‌ సినిమా ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌ 7న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ రెండు సినిమాల మధ్య దూరం మూడు సంవత్సరాలు. అయితే ఇకపై ఇలాంటి గ్యాప్‌ ఉండకూడదని, ఏడాదికో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మహేశ్‌బాబు తన తర్వాతి సినిమాలను ప్లాన్‌ చేసుకుంటున్నారని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్‌లో ఓ సినిమా చేయనున్నారట మహేశ్‌బాబు.

అలాగే సందీప్‌ రెడ్డి వంగాతో మహేశ్‌బాబు ఓ సినిమా చేస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే మరో స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ కూడా వరుస సినిమాలను రిలీజ్‌ చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే... అల్లు అర్జున్‌ గత చిత్రం ‘పుష్ప: ది రూల్‌’, రాబోయే చిత్రం ‘రాకా’ (అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమా) ల మధ్య మూడు సంవత్సరాల గ్యాప్‌ కనిపిస్తోంది. ఈ గ్యాప్‌ను తగ్గించాలని అల్లు అర్జున్‌ స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యారట. ఈ దిశగా అల్లు అర్జున్‌ తన లైనప్‌ను రెడీ చేసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

‘రాకా’ తర్వాత తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో అల్లు అర్జున్‌ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లుగా అల్లు అర్జున్‌ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ స్టార్‌ హీరోల తరహాలోనే మరికొంత మంది హీరోలు సైతం సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్‌ రాకుండా తమ లైనప్స్‌ను, కాల్షీట్స్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నారు. అయితే స్టార్‌ హీరోల సినిమాల విషయంలో వారి ఫ్యాన్స్‌ను హ్యాపీ ఫీలయ్యేలా చేసే విషయం ఒకటి ఉంది. వారి సినిమాలు రీ రిలీజ్‌లు అవుతుంటాయి. అయినప్పటికీ కొత్త సినిమాలతోనే ఆడియన్స్‌ ముందుకు రావాలని స్టార్‌ హీరోలు ప్లాన్స్‌ చేస్తున్నారు.  – ముసిమి శివాంజనేయులు

Advertisement
 
Advertisement
Advertisement